Thursday, April 24, 2025
పుస్తకం
Sunday, January 26, 2025
ఏదో వెలితిగా ఉంది ఈ రోజు
*ఏదో వెలితిగా ఉంది*
----------------------------------
ఏదో వెలితిగా ఉంది ఈ రోజు
వెన్నెల అంత ప్రశాంతంగా ఉన్నా నాలో ఆ ప్రశాంతత లేదని...
ఏదో వెలితిగా ఉంది ఈ రోజు
పచ్చని పైరులో చల్లని గాలి నా ముఖానికి తాకినా అలసట తీరడం లేదని...
ఏదో వెలితిగా ఉంది ఈ రోజు
పక్షుల కిల కిలలు విన్నా కూడా నా గొంతులో రాగం పలకటం లేదని...
ఏదో వెలితిగా ఉంది ఈ రోజు
హోరున జారిపడుతున్న జలపాత వేగం నాలో లేదని...
ఏదో వెలితిగా ఉంది ఈ రోజు
పసి పాపల కల్మషం లేని నవ్వు నాలో మాయమైందని...
ఏదో వెలితిగా ఉంది ఈ రోజు
అమ్మ భాషలో కమ్మని తనం నేడు నా మాటల్లో కరువైంది అని...
అవునులే రంగు కాగితాల వేటలో , పగటి వేష గాళ్ళ మధ్య బ్రతుకుతుంటే వెలితి కాక ఏముంటుంది...
✍️శ్రీ✍️
Friday, August 25, 2023
భూమి చంద్రుని తో
ఎన్నెన్ని కవితలు, కథలు , కందపద్యాలు, యుగళ గీతాలు, విరహ తాపాలు, గజళ్లు, అవధానాలు...
అసూయ కలిగేది నిన్ను చూస్తుంటే.
ఇప్పుడు నీ వంతు సుమా!
తెల్లని మబ్బుల మాటు నుంచి నీలి వర్ణాలను, అక్కడక్కడ పచ్చని ఛాయలను ఎలా వర్ణిస్తావో...
దూరం తగ్గింది, దారులు పడ్డాయి. పల్లెటూరు లాగా పదే పదే కలుస్తామో, లేక పట్టణాల లాగా పలకరింపు కూడా కరువు అవుతుందో...
ఎంత త్వరగా నా భారం తగ్గించి తరువాత తరానికి ఆతిథ్యం ఇస్తావో.
ఆశ తో ఎదురు చూస్తూ...
నీ అవని
✍️ శ్రీ ✍️
24.08.23.
నీ మీద కాలు పెట్టిన క్షణం
Saturday, December 12, 2020
కదలని(వ్వని) కాలం
నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు కరిగే
సమయం
నువ్వొస్తావని తెలిసి మొండికేస్తుందేమో ...
అందుకే అస్సలు కదల్ననే గడియారపు
ముల్లుని
బతిమాలో భయపెట్టో
పరిగెత్తించాలనుకుంటా...
గాలి తెమ్మెరలా ఎప్పుడూ ఏదో పాట
నలిగే నా పెదవులపై
నువ్వు రాగానే మౌనం
ఆవహిస్తుందెందుకనో..
నిన్ను సేదతీర్చటానికయినా ఈ సారికి
ఆ సిరిమువ్వల గొంతు అప్పు తెచ్చుకుంటా...
నవ్వులో కూడా కంటి చెమ్మ కలిసుంటుందెందుకనో
ఈసారైనా జ్ణాపకాల గులాబీలు తడిమితే
పరిచయాల పరిమళాలతో పాటు
ఎడబాటుల ముళ్లుంటాయని గుర్తు తెచ్చుకుంటా...
Wednesday, June 10, 2020
మరో పీడ కలా ???
అంగుళమున్న మిడతల్లారా ఆరడుగుల మనిషిని వణికిస్తున్నారా
ఒక్క పూట వదిలితేనే టన్ను పంట తింటారంటా
ఎడారిలో ఉంటారంటా, వర్షానికి పెరుగుతారట
అకాల వర్షాన్ని, ఎదురు చూడని మాంద్యాన్నీ తట్టుకుని
రక్తాన్నే చెమటగా మార్చి పంట పండించే
అన్నదాతనూ పగబట్టి పంటను స్వాహా చేస్తారా
ప్రకృతి కోపానికే అల్లాడుతున్న పచ్చని చేలల్లో
రాకాసి మూకలై దాడికి దిగుతారా
మనుషులందరికీ ముచ్చెమటలు పట్టిస్తారా
మహమ్మారి ఉగ్రరూపానికి కకావికలమైన దేశానికి
మూలిగే నక్క మీద తాటిపండల్లే దెబ్బ కొడతారా
చరిత్రలో మరో పీడకలగా మారుతారా
Monday, May 18, 2020
వలస జీవి బతుకు చిత్రం
వలస జీవి బతుకు చిత్రం
కన్నీరింకి పోయిన కళ్ళతో వేల మైళ్ళ
ప్రయాణం
ఆకలితో పొట్ట చేత పట్టుకు ఆగని సాహసం
ఎండకు మాడుతూ నడిచే పసి మొగ్గలు
అలసి సొలసి సొమ్మసిల్లిపోయే నిండు చూలాలు
వేల మైళ్ళ పయనం చూసే కంటికే నొప్పొచ్చేలా
వారి దైన్యం
పొట్టకూటికి సొంతూరొదిలి వచ్చినందుకు
మహమ్మారి పుణ్యమాని మెతుకు దొరకని వైనం
కన్న ఊరెళ్లే దారిలేక, ఆకలితో అలమటించలేక
నెత్తిమీద మూటతో చంకలో పిల్లలతో
వేల మైళ్ళ పయనం చూసే కంటికే నొప్పొచ్చేలా
వారి దైన్యం
ఎండనకా, వాననకా ఆగని కాలి చక్రం
దాతలిచ్చే పట్టెడన్నం కోసం ఆగని పడిగాపులు
కన్నపేగు ఆకలి తీర్చి, నీటితో కడుపునింపుకుంటూ
ఎడతెగని ప్రయాణం, ఎప్పటికీ చేరేనో గమ్యం
వేల మైళ్ళ పయనం చూసే కంటికే నొప్పొచ్చేలా
వారి దైన్యం