Thursday, March 7, 2019

రైలు ప్రయాణం


ఒకనాడు రైలు ప్రయాణం అంటే ఎంతో సరదా 

కొత్త స్నేహాలు, కిటికీ పక్కన కూర్చుని చూస్తుంటే పరిగెత్తి పారిపోయే ప్రకృతి అందాలు

రాజమండ్రి దాటగానే గోదావరి లో రూపాయి బిళ్ల లు వెయ్యాలనే పోటీ

నెల రోజులు కష్టపడి చేసిన చెక్క పుల్లల పడవను పారుతున్న నదిలో వెయ్యాలని ఏదో ఆశ

ఎక్కిన స్టేషన్ నుంచి దిగే స్టేషన్ లోపు వరసలు కలుపుకునేటంత కొత్త పరిచయాలు 

మనం వండుకున్న వంటకాలు వేరొకరికి ఇచ్చి, వారివి మనం పంచుకొని సరదా కబుర్లు, కథలు చెప్పుకొని ప్రయాణించిన రోజులు

కానీ ఈ రోజు నేను చూసిన చేసిన ప్రయాణం...
పెళ్లయిన నవదంపతులు మాట మంతి లేకుండా చెవిలో ఇయర్ ఫోన్ లు పెట్టుకొని సినిమాలు చూస్తూ...

మధ్య మధ్య లో whatsapp లో ఎవరో స్నేహతులతో చాట్ చేసుకుంటూ... 

పరిచయం లేని పరాయి వ్యక్తులలాగ ఆ ప్రయాణం ఏమిటో...

బోగీలో ప్రతి వారి చెవులకు, పుట్టుకతోనే వచ్చాయా అన్నట్లు ఇయర్ ఫోన్ లు...

తమలో తామే నవ్వు కుంటూ
ఎదుటి వారు ఏమనుకుంటారోనన్న కనీస స్పృహ లేని తనం...

ఈ స్మార్ట్ ఫోన్లు వల్ల నిమిషాలలో బెర్త్ కన్ఫర్మేషన్ తెలుస్తోంది కానీ...

గంటలు గంటలు ప్రయాణం చేసిన కనీసం ఒకరి పేరు ఒకరికి తెలియక పోవడం...

ఒకనాటి రైలు ప్రయాణం అనుభూతులు , గుర్తుకు తెచ్చుకొని ఆనందపడాలో లేక నేటి ప్రయాణాలు తలుచుకొని బాధ పడాలో తెలియడం లేదు.


Saturday, March 2, 2019

యుద్ధం



రాజ్య కాంక్షకు, అసమర్థ పాలన కు పుట్టిన అక్రమ సంతానం యుద్దం.

అభివృద్ధికి వెన్నుపోటు  , అవకాశవాదానికి ఆయువుపట్టు యుద్ధం.

తరతరాల చరిత్రలకు తిరోగమన తిలకం యుద్దం

రాజకీయ కుయుక్తులకు , ఎత్తులపై ఎత్తులకు పరాకాష్ట యుద్ధం

ఎన్నో అందమైన జీవితాల సుమధుర స్వప్నాలను కాలరాసే రక్కసి యుద్ధం

స్వార్థ స్వప్రయోజనాలే కానీ సామరస్యం సాధించలేని సంకుచితతత్వం యుద్ధం

గెలుపుపెవరిదయినా  ప్రజల పక్షానే నష్టం అనడానికి నిలువెత్తు సాక్ష్యం యుద్ధం

యుద్ధం అంటే కాదు పక్క వాడి మీద పడిపోవడం..
నీలో అంతర్మధనాన్ని జయించి ఒక మనిషిగా ఎదగడం...

✍ శ్రీ ✍