Sunday, November 24, 2019

నాకోసం...


రెప్పల తలుపులు మూసుకున్నాయి
ఏదో కొత్తలోకపు ప్రయాణం
నల్లరంగు రగ్గు కప్పుకున్న
  ప్రపంచం...
నిప్పుల లోయలు...హాహాకారాలు
మచ్చుకైనా లేని జీవం
చిమ్మ చీకట్లను తోసేస్తూ గబ గబా దారులన్నీ దాటేస్తున్నా...
మెత్తగా చేతికి తాకిన నీ స్పర్శ...
కలలో కూడా నువ్వున్నావనే భరోసా...


Wednesday, November 13, 2019

నేను ---- తాను


తానొక పుష్పం 
నేనేమో ధవనం
మా ఇరువురి కలయిక పరిమళం

తానొక మధురం
నేనొక రుధిరము
కలిసిన కొలది పెరిగేను ప్రణయం

తానొక మేఘం 
నేనేమో పవనం
కలిసిన మరు క్షణం వర్షం

తానేమో ప్రేయసి
నేనేమో ప్రియుడు
మా ప్రేమే అజరామరం

తానేమో తనువు
నేనేమో ఆయువు
కలిసిన మమైక జీవనం

తాను తానే 
నేను నేనే
కానీ ఒకరిని వీడి మరొకరు మనలేము

ఊహల్లో, ఊసుల్లో
కలలో, కదలికలో
ఆలోచనల్లో, ఆచరణలో
అదే మేము 

నేను ---- తాను

✍ శ్రీ ✍

Tuesday, November 12, 2019

జ్ఞాపకాల పరిమళాలు



పనిగట్టుకు కళ్లాపి జల్లి వెళ్లిపోయే మేఘాలు...
నీ ఊసులే చెప్పుతూ ఊరిస్తూనే ఉంటాయి.
జారిపడే చుక్కల కోసం చేతులు చాచిన కొబ్బరి చెట్లు...
రంగులెయ్యని బొమ్మలా ఊరకనే వెక్కిరిస్తాయి.
అడుగులో అడుగేసే సెకన్ల ముల్లు...
కాలం కదలదని చెపుతూనే ఉంటుంది.
ఎప్పటిలా పదిలంగా ఉండేవీ...

తలచినా చాలు హఠాత్తుగా హత్తుకొని ఉక్కిరి బిక్కిరి చేసేవీ... 
నీ జ్ఞాపకాలు

Wednesday, November 6, 2019

మా బడి





గుల్మోహర్ పూల ఎర్ర తివాచీ తో కప్పేసిన దారులెక్కడ
“తోటమాలి” కర్ర చప్పుడు కి పరుగులేత్తే తుంటరి తనాల జాడెక్కడ

అలసిన మధ్యాహ్నాలలో ఆడిన తొక్కుడు బిళ్లాటల గళ్ళెక్కడ
“మామ్మ బడ్డీ” లో కొనుక్కున్న నారింజ మిఠాయిల లెక్కెక్కడ

బువ్వ పంచుకుతినే మా మామిడి చెట్ల గట్లెక్కడ
గొప్పగా లెక్కపెట్టుకున్న ఆకాశ మల్లె పూల గుత్తుల పరిమళాలెక్కడ

దారిలో ఏరుకున్న ఈతపళ్లూ, మామిడి పిందెల రుచులెక్కడ
క్రమశిక్షణకు మారుపేరైన మా మాష్టార్ల అదిలింపులెక్కడ

బాల్యపు తీపిగురుతులన్నీ ఒడిలో నింపుకున్న మా“బడి” ఆనవాలెక్కడ