Saturday, August 29, 2015

తెలుగు భాషా దినోత్సవం

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు , అన్నది కూడా మన తెలుగు వాడు కాదు.

అంతటి ఔన్నత్యం ఉన్న తెలుగు నేడు ఎందుకు ఇంత హీన స్థితిలో ఉంది (క్షమించాలి, ఈ పదజాలం ఉపయోగించినందుకు, కానీ వాస్తవం ఇదే)

పక్క రాష్ట్రాలలో ఆయా భాషలలో మాట్లాడకపోతే విలువ ఉండదు. మన రాష్ట్రంలో మన భాషలో మాట్లాడితే విలువ ఉండదు..

దీనికి బాధ్యులు ఎవరు ??? మనం  కాదా…(తల్లిదండ్రులు, ప్రభుత్వము)

తల్లిదండ్రులు : మనం మన పిల్లలని తెలుగు మీడియం లో చదివించము… సరే ఒప్పుకుంటాను, ఆంగ్లం రాకపోతే, ఈ పోటీ ప్రపంచం లో నిలదొక్కుకోవటం కష్టం కాబట్టి….

కానీ వారిని ఇంట్లో కూడా తెలుగు లో మట్లాడనీయం… ఎందుకంటే వారికి ఆంగ్ల ఉచ్చారణ ఆలవాటు అవ్వదని… ఇదెంతవరకు సమంజసం.

ఎంతమంది తల్లిదంద్రులు రామాయణ, మహ భారతాలు,పంచతంత్రం వంటి కథలు తమ పిల్లలకు చెపుతున్నారు( ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు)…

రాముడు, కృష్ణుడు అంటే ఈనాటి పిల్లలకు ఫ్యాన్సీ డ్రస్ పోటీలో ఒక వేషం మాత్రమే.

వారి కథ వీళ్ళకి తెలియదు, వారి పాత్రల ఔన్నత్యం మనం మన పిల్లలకి చెప్పము.

మనవాడు Spell Bee లో ఎంపికయ్యాడని గర్వపడుతున్నాం కాదనను…కానీ మనలను అమ్మ నాన్న అని పిలవడం లేదని మరచిపోతున్నాం.

మన ప్రభుత్వం తెలుగు ప్రోత్సాహకాలు అని అంకెలగారడీ చూపించడమే గానీ చేసింది ఎమీ లేదు.. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మొక్కుబడిగా తెలుగు భాషా దినోత్సవం జరపడం తప్పితే పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన భాష కోసం చేసిందేమీ లేదనిపిస్తుంది.

మనం Shakespeare, Tolstoy వంటి వారికోసం తెలుసుకుందాం…కానీ నన్నయ,తిక్కన ఎర్రన , పోతన వంటి వారిని మరచిపోవద్దు.

వారే కాదు మన సాహిత్యం కోసం పాటు పడిన ఎందరో మహానుభావులందరి గురించి తెలుసుకుందాం, తెలుసుకుని మన పిల్లలకి చెబుదాం.



ఇకనైనా మన పిల్లలకి తెలుగు నేర్పిద్దాం, మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పదనం వారికి ఆలవాటు చేద్దాం.

కనీసం మన పిల్లలతో అమ్మ నాన్న అని అచ్చ తెలుగు లో పిలిపించుకుందాం.

ఈ మార్పుని మన ఇంటినుంచే మొదలు పెడదాం.

29 ఆగష్టు – తెలుగు భాషా దినోత్సవం

Sunday, August 2, 2015

స్నేహం...



ఇది అందరి జీవితం లో ఒక భాగం…

ఇది లేని జీవితం వ్యర్ధం…

దీనిని అనుభవించని జీవితం అసంపూర్ణం…

ఎన్నో పాఠాలను మరెన్నో గుణ పాఠాలను…

ఎన్నో అనుభూతులను మరెన్నో ఆనంద క్షణాలను…

అలవోకగా పంచే…ఆత్మీయ అనుబంధం ----స్నేహం

కష్టాలలో సుఖాలలో మన అన్న వారు కనపడనప్పుడు…
నేనున్నానంటూ అభయ హస్తం అందించేదే స్నేహం…

సంవత్సరానికి ఒక్కసారి కలిసినా…ఆరోజు కోసం క్షణం, ఆ జ్ఞాపకం
నేటికీ తలచుకుంటే అత్యద్భుతం రా శ్రీను…ఇదేరా స్నేహం

చిననాటి ఆ నలుగురు స్నేహితులు, వారితో కొట్లాటలు, సరదాలు,  జారుడు బల్లలు, కోతి కొమ్మచ్చులు,
బడి గంట కొట్టినప్పుడు., పరుగు పరుగున వెళ్తూ పడిపోయిన స్వామి గాడు…

ఈరోజు తల్చుకుంటే ఎంత హాయి…
ఇదేరా స్నేహం…
వీధి చివర్న, హై వే రోడ్డుపైన…గోలీలాటలు, కర్రాబిళ్ళలు, ఎదుటి గ్రూపుతో కొట్లాటలు…
క్రికెట్లూ, కబడ్డీలు, ఎన్నో ఎన్నెన్నో …తలచుకుంటే నాటి జ్ఞాపకాల దొంతరలో..ఎక్కడో మనల్నందరినీ ఒకటిగా కలిపి, ఇన్ని మధురానుభూతులనిచింది స్నేహమే కదా…

చదువుల సుడి గాలి లో కొట్టూకుపోతున్న…కాలేజిలో…ఆ ఏజిలో…  ర్యాగింగు చేసిన సీనియర్లు…మరలా సంవత్సరపు మన తోటి స్నేహితులు…క్యాంపస్సులో క్రికెట్టులూ…బీచ్ లో స్నానాలు..హాస్టలులో కంబైండు స్టడీస్...బీచ్ లో హాఫ్ డేస్…

తెలుగు తప్ప అన్య భాష రాని నాలాంటి వాళ్ళకు…బాధ్యతాయుతంగా ఇంగ్లీషు పాఠాలు నేర్పిస్తుంటే…మేమున్నామంటూ భరోసా ఇచ్చి… పరభష మీద…భయం పోయేట్లు చేసింది మీ స్నేహం కాదా…

ల్యాబ్ ల బయట…గ్రౌండ్ గట్టు మీద లైబ్రరీలో…మనతో పాటు కూర్చుని…వారికి వచ్చింది కొంత మందికి చెప్తూ…రానిది వేరే వాళ్ళనుంచి నేర్చుకుంటూ…ల్యాబ్ లు యూనిట్ లు కంప్లీట్ చేసింది, చేయించింది ఈ స్నేహమే కదా…

పది వసంతాలు దాటిపోయిన…పదిరోజుల క్రితమే విడిపోయామన్న మధురానుభూతిని ఇచ్చింది ఈ స్నేహమే కదా…

పని ఒత్తిడి లో మనుషులమన్న ధ్యాసను మరిచి…మరమనుషుల్లా పనిచేసుకు పోతున్నా, ఒక స్నేహితుడి పుట్టిన రోజని, మరొకడి పదోన్నతి అని మన వారాంతాలను అందరం ఆహ్లాదం గా దూరంగా, సాగర తీరంలో, నక్షత్రపు హోటళ్ళలో గడిపింది ఈ స్నేహం వల్లే కదా…

మీటింగుల మీద మమకారంతో…బాసంటే భయంతో టార్గెట్లను పూర్తిచేస్తూ ఉషోదయ వేళ…స్విమ్మింగులూ షటిళ్ళతో బాధ్యత బరువులను మరచిపోతూ ..సరదాగా గడిపింది ఈ స్నేహం వల్లే కదా…

నా జీవిత భాగస్వామిగా నా ప్రతి మజిలీలో సహ బాటసారిగా …ప్రతి కష్టం, సుఖంలో నాకు చెదోడు వాదోడుగా ఏ అరమరికలూలేని నా జీవితం ఇంత సంతోషం గా ఉండటానికి ఇంకేదో బంధం ఉంది అనుకుంటుంటే ఇప్పుదు తెలిసింది కారణం…అది స్నేహమే కదా…

నా చిన్ననాటి నుంచి నేటి వరకు, ఏదో విధంగా నా జీవితం మీద ప్రభావం చూపిన నా స్నేహితులందరికీ ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు….

శ్రీ
(BJS Reddy)