Monday, March 30, 2020

గుణపాఠం



మొదటి సారిగా, తెలిసిన మనిషిని చూస్తున్నా ఏదో అంతర్లీనంగా తెలియని భయం 

ఎవరిని కలవాలన్నా , మాట్లాడాలన్నా తెలియని సంకుచిత భావం

ప్రకృతినీ జయించామని విర్రవీగిన మనిషి మస్తిష్కానికి సవాలు విసిరిన వైనం

అభివృద్ధి చెందిన దేశాలకు వాళ్ళ అభివృద్ది సూచికల స్థాయినీ తెలిపిన క్రమం

ఒకరి పైశాచికత్వాన్ని , అధికారదాహానికి , అమానుష చర్యకు నిలువెత్తు నిదర్శనం

మేధావులనుకుంటున్న వారి భద్రతా లోపాలు, ముందు జాగ్రత్తలను వేలెత్తి చూపిన క్షణం

కొన్ని లక్షల కోట్ల పశు పక్ష్యాదుల మూగ ఘోషకు ప్రతి స్పందించి ప్రకృతి ఇచ్చిన సమన్యాయం

ఇప్పటికైనా ప్రతి జీవీ పరమాత్మ స్వరూపం అని చెట్టూ చేమా సమానమని నేర్చుకుంటారో లేదో ఈ గుణపాఠం

✍️ శ్రీ ✍️

Sunday, March 8, 2020

నేనొక స్త్రీ మూర్తిని



నేనొక మట్టి ముద్దను, నీ చేతులతో సృష్టిస్తానంటే ఏ ఆకృతి నైనా నాలో మలుచు కునే మగువను

నేనో కొన్ని నీటి చుక్కల సమూహాన్ని, నీ రూపాన్ని సంతరించుకునే సహజత్వాన్ని...

నేనొక బీజాంకురాన్ని, నీ ప్రేమ మమకారాల కలయికతో నీ వంశ వృక్షాన్ని నిలబెట్టే  అమ్మతత్వాన్ని

నేనొక చిట్టి నేస్తాన్ని, నీతో పాటూ అన్ని పంచుకుంటూ, అనుబంధాన్ని పెంచుకునే అక్కా చెల్లిని...

నేనొక ప్రేయసిని, నీ కోసం  అనుక్షణం పరితపించే, అహర్నిశలు నీ ఆలోచనలతో బ్రతికే చెలిని...

నేనొక అమ్మని, నా పిల్ల ల అల్లరి చేష్టలకు ఆట బొమ్మను...

నేనొక ఒక లతను, బంధాలను, బాధ్యతలను ప్రేమగా అల్లుకుంటూ మీతో, మీ కోసమే బ్రతికే ఇల్లాలిని...

వెరసి ఆది నుంచి అంతం వరకు రూపాంతరాలు చెందుకుంటూ రూపురేఖలు మారుతున్న మీ కోసం... బ్రతుకుతూ, నా వాళ్ళ కోసమే అనుకునే నేనొక స్త్రీ మూర్తిని...