Monday, September 17, 2018

ప్రణయా'మృతం'


పెత్తందారుల గుండెల్లో ప్రేమ కెరటమై ఎగసిపడ్డాడు

ప్రేమనయితే గెలిపించుకున్నాడు కానీ ప్రాణాలను కోల్పోయాడు

ఇంకా కులాల కోసం, ప్రాణాలు తీసుకునే ఆటవిక సమాజంలో ఉన్నందుకు మరొక సారి సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకుంది

 నీ కూతురు మీద ప్రేమ  ఉందన్నావు, కానీ తన కడుపులో ఉన్న బిడ్డను చంపుకోమనే గొప్ప తండ్రివయ్యావు

కూతురు తల్లి కాబోతుందనే వార్త విని ,సంబరాలను అంబరాలకు తాకించే తండ్రి గురించే విన్నాం ఇన్ని రోజులూ..

ఆ కూతురికి, భర్త మొండాన్నే బహుమతిగా ఇచ్చే కులపిచ్చి  సైకో ను చూస్తున్నాం కొత్తగా

ఎక్కడరా నీ కులం, ఆస్తి, అంతస్తు, సంఘంలో నీ పరువు, ఐదో తనం కోల్పోయిన నీ కూతురు కాళ్ళ గోటి విలువ లేనివి

కన్న కూతురు తోనే "ఎదురుగా వస్తే, నేనే చంపేస్తాను" అనిపించుకున్న తండ్రితనం ఉన్నా ఒక్కటే లేక పోయినా ఒక్కటే

ఇక నైనా పండిరా మీ కుల గజ్జి చేష్టలు , మత పిచ్చి అంధ విశ్వాసాలు

విచ్చల విడి తనం వద్దు విచక్షణతో ఆలోచించండి, కోటి కలల ఆ నిండు జీవితాలు మీ కులం తీసుకురాగలదా

మీ హోదాలూ, మీ అహాలూ ఆ హృదయాల గాయాలు మాన్పగలవా

ఏమి సాధించావురా ఈ హత్యతో... పరిగెత్తి ప్రాణ భిక్ష పొందడం తప్ప

దీని కోసమా ఇన్నాళ్ళూ మానసిక క్షోభ పడ్డావు, పెట్టావు

ఒకనాడు కూతురిని ప్రేమతో సాకిన నువ్వు , కల్లు తాగిన కోతిలా నేడు విధ్వసం సృష్టించి సార్థక నామధేయుడివి అయ్యావు
  


### ఇకనైనా ప్రభుత్వాలు కులాల పేరుతో కాకుండా ఆర్థిక అసమానతల బట్టి రిజర్వేషన్ కల్పిస్తే ఈ కుల పిచ్చి కొంతయినా తగ్గుతుంది. స్వఛ్ఛందంగా రిజర్వేషన్ వదులుకున్న వారిని, ఇతర కులాల వారిని ప్రేమ వివాహాలు చేసుకున్న వారినందరినీ ఒక వర్గం గుర్తిస్తే కొన్నేళ్లకు ఈ కులం అనే మహమ్మారి నుంచి మన సభ్యసమాజాన్ని కాపాడుకోగలం అని నాదో చిన్న ఆశ###




Sunday, September 9, 2018

కాళోజీ


తెలుగు సాహిత్య చరిత్రలో వందేళ్లయినా పదును తగ్గని  అతి కొన్ని కలాల్లో మరిచిపోలేని, 
రాసింది అక్షరాలా పాటిస్తూ , 
నిర్భీతిగా నిజాన్ని చెప్తూ 
ఆఖరి శ్వాస వరకూ అక్షర సేద్యం 
చేసిన అవిశ్రాంత శ్రామికుడు 

కవితలతో ఆవేశాన్ని నింపి , 
కథలతో ఆలోచనను మేల్కొలిపి
ప్రసంగాలతో నిదురిస్తున్న మెదళ్ళను తేజోవంతం చేసి 

నాటి తెల్లవారి దురాగతాల నుంచి
నేటి నల్ల వారి దౌర్జన్యాల వరకూ ఎవరికీ బెదరక, కలంతో ఖండిస్తూ వచ్చిన అలుపెరుగని సైనికుడు

జోహార్లు కాళోజీ జోహార్లు

నీ కలానికి , నీ ఖలేజా కి

నువ్వు నడిచిచూపిన మార్గానికి,
నమ్మిన సిద్ధాంతానికి...

జోహార్లు కాళోజీ జోహార్లు

రైతు - నానీలు



* స్వేదం తో సేద్యం
ఆకలితో నేస్తం
ఇదేనా రైతు రాజ్యం

* కాయకష్టం మాది
కాసిన కాసిని గింజలు మీవి
బతుకులు బరువు మాకు
బలిసిన పరుసులు మీకు

* ఒకనాడు అన్నదాత
నేడు అధ్వాన్న మయ్యేను నీ తలరాత
నిన్ను కోల్పోతే లేదు భవిత
నిన్ను కాపాడుకోవడమే మా తక్షణ బాధ్యత

* రైతు లేని రాజ్యం
కానున్నది రాబందుల పరం
మేలుకోక పోతే నేడు మనం
కానున్నది బ్రతుకు దుర్భరం

* రాలని చుక్కల కోసం ఆకాశం వైపు చూస్తూ
రాలిపోయిన పంటను భూమి మీద చూస్తూ
పస్తులతో చూసి చూసి ఛస్తూ...

* నేల మీద కాళ్లు
ఆకాశం వైపు చూపులు
ఎండిన డొక్కలు
ఎన్నాళ్లీ ఎదురు చూపులు

* అన్నదాత లే అన్నం కోసం ఎదురుచూసేను
పచ్చడి మెతుకులు దూరమయ్యేను
పురుగుల మందులు ప్రియమయ్యేను

* బీడు భూములు
పనిచేయని బోరులు
కోతకు రాని పొలాలు
కలిసి రాని కాలలు

* కనిపించని ఆ దేవుళ్ల వరాలు కన్నా
ఆకలి ని చంపే నీ కరాలు ఎంతో మిన్న

* ఇనుప కండరాలు, ఉక్కు నరాలు
హలాల వంటి కరాలు
ప్రభుత్వ పథకాల ముందు
పక్ష వాతం వచ్చిన అవయవాలు