Sunday, February 25, 2018

శ్రీదేవి...


రాలిపోయింది ఒక ధ్రువతార

నిష్క్రమించింది ఒక అందాలతార

కీర్తి కిరీటాలే కాదు కలహాల కంచెలను అవలీలగా మోసింది

బాల తారగా బహుముఖ ప్రజ్ఞ చూపించి

యుక్త వయస్సులో యువకుల హృదయాలలో నిద్రపోయి

ఏంతో మందికి నిద్రలేని రాత్రులు రుచిచూపిన దేవకన్య

మలి వయస్సులో కూడా తనకు సాటిలేదని చాటిన నట మయూరి

తన జ్ఞాపకాలనే మరల మరల నెమరు వేసుకోమని

అందానికి నిర్వచనము తానై అందరాని లోకాలకు
మౌనంగా వెళ్లి పోయిన మహానటి కి అశ్రునివాళి

( 13/08/1963 - 25/02/2018)




Tuesday, February 13, 2018

నిన్ను మరిచిపోదామని...




ప్రియా...

నిన్ను మరిచిపోదామని
హృదయాన్ని శిలగా మార్చుకుంటే
నీ జ్ఞాపకాలు ఆ శిలని శిల్పం గా మారిస్తే
ఆ శిలా రూపం నీదే అయితే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
కొద్ది క్షణాలు గాడనిద్ర లోకి వెళితే
కలలోకి కథలు ఏవో వస్తే
ఆ కథల కావ్య కన్యకది నీ రూపమే అయితే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
విహారయాత్రకు వెళితే
దూరాన కమ్మని కోయిల గానం వినిపిస్తే
ఆ గానం నీ గాత్రాన్ని గుర్తుచేస్తే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
విదేశాలకు వెళ్ళితే
చిరు మందహాసంతో వనితలు ఎవరో ఎదురొస్తే
ఆ మందహాసంలో నీ మోమే కనిపిస్తే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
సాగర తీరానికి సేదతీరడానికి వెళితే
అలలు ఆశగా నా కాలిని తాకితే
ఆ స్పర్శ నీ స్పురణను రప్పిస్తే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
మౌనాన్ని ఆశ్రయింస్తే
నా ఉచ్ఛ్వాశ  , నిశ్వాస గుండె లయ శబ్ధాలు వినిపిస్తే
ఆ లయలో నీ హోయలే కనిపిస్తే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
విఛ్చిన్న మైన మనస్సుతో , అగమ్యగోచరంగా నడుచుకుంటూ వెళ్తున్నా
అంతలో పిడుగులు , మెరుపుల వర్షం ఎదురైతే
ఆ మెరుపుల వెలుగులలో నీ మోమే ప్రతిబింబిస్తుంటే
నిన్ను మరిచేదెలా...!


నిన్ను మరిచిపోదామని
ఒక నిశీధి గదిలో ఒంటరిగా కూర్చున్నాను
ఆ గదిలో మౌనము
మదిలో అనంతమైన నీ ఆలోచనల పరిభ్రమణం
నిన్ను మరిచేదెలా...!