Friday, May 10, 2019

స్వేచ్ఛ


ఎక్కడ లేదు స్వేచ్ఛ... ఈ స్వతంత్ర భారతంలో 

చెప్పిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడిగితే,
అడిగిన వారిని దేశ ద్రోహులని ప్రకటించగలిగే స్వేచ్ఛ...

యుద్దమంటే  గెలిచినా, ఓడినా నష్టం అని తెలిసినా,
యధేచ్ఛగా రాజకీయ లబ్దికోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే స్వేచ్ఛ

80 రోజుల్లో నోట్లు రద్దు వల్ల మంచి ఫలితాలు రాకపోతే ఎక్కడైనా నన్ను ఏమైనా చేసుకోండి అన్న పెద్ద మనిషి ఫలితాలు సంగతి అటున్చి 80 మంది పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయి నా, వైఫల్యాలకు సమాధానం చెప్పని స్వేచ్ఛ...

ఒక పార్టీలో గెలిచి , అదే పదవులతో వేరే పార్టీల్లో కొనసాగుతున్నా
చూపుడు వేలు తో ఓటు వేసిన ఓటరు నోరు విప్పి అడగలేని స్వేచ్ఛ...

ఆ పార్టీకి ఓటు వెయ్యక పోతే వాళ్ళు భారతీయులు కాదు, ఆ మతానికి చెందిన వారే కాదు అని ప్రసార మాధ్యమాలలో నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నా పెదవివిప్పి అడగని స్వేచ్ఛ... 

అధికారం చేతిలో పెట్టుకొని, అడ్డగోలుగా వ్యవహరిస్తూ, వాళ్ళ అడుగులకు మడుగులొత్తే వారికి అనుకూలంగా ప్రవర్తించినా వేలెత్తి చూపని స్వేచ్ఛ...

ప్రతిపక్షమే లేకుండా పాలన సాగించాలని ప్రయత్నిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు,
ఎందుకిలా అని అడిగితే అభివృద్ది గురించి నీకేం తెలుసని అడిగే స్వేచ్ఛ...

ఎప్పుడో పారిశ్రామికీకరణ పేరుతో యంత్రాలను తెస్తే ప్రపంచ మేధావులు ఎదురు తిరిగారు,
కానీ ఇప్పుడు మనుషులనే యంత్రాలుగా మార్చి రోజుకు 14 గంటలు, ఆదివారం అర్థ దినాలతో పని చేస్తున్నా నోరు మెదపని స్వేచ్ఛ...

ఇంత స్వేచ్ఛ నా దేశంలోకాక ఇంకెక్కడ దొరుకుతుంది, 
ఈ స్వేచ్ఛ కేవలం దొరికేది కొందరికే... పాలకులకు, పెత్తందారులకు

అయినా ఇంకా స్వేచ్ఛ కావాలంటారా, ఎవరికి???
జీవించడం మానేసి, బ్రతికేస్తున్న ఈ జీవచ్చవాలకా ,
ప్రతి రోజూ మరణిస్తూ బ్రతుకులీడుస్తున్న బడుగు జీవులకా


ఎవరికుంది స్వేఛ్ఛ???
సమాదుల్లో పూడ్చిన దేహాలకు
చితి మంటల్లో కాలుతున్న అవయవాలకు
శీతాకాలం లో కూడా కారుతున్న వెచ్చటి కన్నీరుకు
ఆకలి అని పదే పదే గుర్తు చేస్తున్న ప్రేగులకు

1 comment:

రవి said...

బాగుంది రెడ్డిగారు