Thursday, September 28, 2017

నాలో కలిగిన ఉద్వేగము



 
17th April 2017 Indonesia,

ఉద్యోగరీత్యా దూరదేశంలో ఉండవలసి వచ్చింది. తప్పని పరిస్థితి, ఎందుకంటే ఈ ఉద్యోగం లేనప్పుడు అనుభవించిన పరిస్థితులు తలుచుకుంటే ఇప్పుడు పడుతున్న కష్టం చాలా చిన్నదిగా అనిపిస్తుంది.
అప్పుడప్పుడు యధావిధిగా పనిచెయ్యని wifi, అయిష్టం గానే తినేసాం అనిపించిన భోజనం, భోజనం చేసి ఎప్పటిలాగే రూమ్ కి వచ్చి పడుకున్నాము, అంతలో నా మొబైల్ మోగింది, wifi సిగ్నల్ లేకపోవడం వల్ల అప్పటివరకు ఎదురు చూసి, నా నుంచి ఫోన్ రాకపోయేసరికి తనే ఇంటర్నేషనల్ కాల్ చేసింది, ఉన్న అతికొద్ది సిగ్నల్ strength తో మెల్లగా ఏదో విధంగా అక్కడి నా పరిస్థితి ని చెప్పి, గుడ్ నైట్ చెప్పి పడుకున్నాను.
మరుసటి రోజు ఎప్పటిలాగే ఆఫీస్ కి టైంకి వెళ్ళిపోయాం అందరం. ఒక అరగంట తరువాత ఎవరో చెప్పారు ఎదురుగా భారతి ఏడుస్తున్నాడు అని, తలెత్తి చూసాను,నిజమే నాకళ్ళు నేను నమ్మలేక పోయాను, ఫోనులో మాట్లాడుతూ ఏడుస్తున్నాడు. ఏమైందో అర్ధంకాలేదు అందరూ ఒక్కొక్కరిగా గుమికూడుతున్నారు, అంతలో నేను తేరుకొని వెళ్ళాను, విషయం ఏమిటో కనుక్కుందామని
ఏడుస్తున్న భారతిని ఓదార్చి, విషయం అడిగాను. అప్పుడు తెలిసింది వాళ్ళ నాన్నగారు చనిపోయారు అని. ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఎలా ఓదార్చాలో తెలియలేదు. కొంతసేపటికి తేరుకొని, తనని తన స్వగ్రామం పంపిచటానికి అవకాశాల అన్వేషణలో పడ్డాము.
luwuk నుంచి makasar, makasar నుంచి jakarta, jakarta నుంచి malasiya, malasiya నుంచి madras అదేవిధంగా
luwuk నుంచి makasar, makasar నుంచి singapore, singapore నుంచి madras ఏ విధంగా చూసినా కనీసం 16 గంటల ప్రయాణం. దానికి తోడు అక్కడనుంచి మళ్ళీ వాళ్ళ స్వగ్రామానికి మరో 6 గంటల ప్రయాణం, ఇవన్నీ అలోచించి కనీసం ఆఖరి చూపుకి కూడా వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక మధనపడ్డ వైనం ఎలా చెప్పాలో చూస్తున్ననాకు అర్దంకాలేదు, ఆరోజంతా తాను ఏడుస్తూ online లోనే తన తండ్రి అంత్యక్రియలు చూసిన సంఘటన కళ్ళ ముందు కదిలిన ప్రతి క్షణం నరకంలా అనిపించేది
అది జరిగిన కొన్నిరోజులు వరకు రాత్రులు నిద్రపట్టేది కాదు, పోనీ నా బాధను నా అన్న వాళ్ళతో పంచుకుందామంటే వాళ్ళని బాధ పెట్టడం భావ్యం కాదు అనిపించింది, ఆలా అని మనసులో బాధతో ఉండడం కూడా అంత సులువేమీ కాదు,అన్ని ఏ అరమరికలు లేకుండా పంచుకునే నా భార్యకి కూడా చెప్పలేక పోయాను, మనం బాధపడుతున్నాం కదా అని బాహ్యప్రపంచంలో యధాతధంగా జరిగేవి జరగక మానవు కదా...
అలా భయంగా, బాధతో కొనసాగుతున్న రోజుల్లో దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం వల్ల మెల్లగా సంఘటన తీవ్రత తగ్గుతున్న క్షణాన 

May 4, 2017, Indonesia

సాయంత్రం whatsapp లో ఒక సందేశం... నా ప్రియమైన గురువు, అతనికి నేను ఏకలవ్య శిష్యుడను. మా బంధం నా కుటుంబానికి, కొద్ది మంది స్నేహితులకు , అతనికి మాత్రమే తెలుసు Ilango సర్ చనిపోయారు అన్న వార్త. ఒక్కసారిగా గుండెలు పగిలేలాగా ఏడవాలని అనిపించింది. నా పెళ్లి రోజు, పిల్లల పుట్టిన రోజు ఎక్కడ ఉన్నా తప్పకుండ గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి పేరు పెట్టి మరి శుభాకాంక్షలు తెలపగలిగే ఒక అద్భుత, అనిర్వచనీయమైన గురు,శిష్యుల సంబంధానికి ఆఖరి రోజు.

సర్ అంత్యక్రియలు ఎలా జరుగుతన్నాయో కూడా కనుక్కోలేను... ఎందుకంటే కుటుంబంలో ఎవరికీ నేను తెలియదు. తెలిసిన కొంత మంది స్నేహితులకు వార్తను చేరవేసాను. ఈక్షణం ఇది జరుగుతుంది అని ప్రతిక్షణం ఉహించుకుంటూ నా గురువుకి మౌనంగా వీడ్కోలు చెప్పడం తప్ప ఏమి చేయలేక పోయాను.
ఈ విషయము కూడా ఎవరితో చెప్పకూడదు అనుకున్నాను కానీ, పావని కి  చెప్పకుండా ఉండలేక పోయాను, చెప్పాను. కొంత ధైర్యం అయితే చెప్పింది కానీ తాను భయపడుతూ, భాద పడడం తన మాటల్లో నాకు తెలిసిన ఆక్షణం, నేను ఇంకా బాధపడ్డాను.

" యంత్రాల రోతల మధ్య యధావిధిగా పనిచేసుకొనే మనకు మనసులేదని నిరూపించారు ఎందరో ...

పనిని పట్టుకు తిరగడమే కానీ, మనల్ని కట్టుకున్న వారికోసం ఆలోచించే అవకాశమే లేకుండా చేసారు మరి కొందరు ...

పుట్టిన పసిబిడ్డని పక్షం అయిన చూడని వాడు ఒక్కడు, ఆ బిడ్డనే ఆసుపత్రిలో చేరిస్తే ఆలస్యంగా వెళ్ళే వాడు మరొక్కడు ...

ఆఖరి చూపుకు కూడా నోచుకోక, నాన్న అంత్యక్రియలు అంతరజాలంలో చూసేది ఒక్కరు ...

అప్పుడప్పుడు అక్కడ కూడా ఒక ధ్రువ తారగా వేలిచి, నిర్మాణ నియంత లోకంలో నిజమైన మనిషి వి అనిపించుకున్నావు ...

కనిపిస్తున్న కార్యాలయానికి, నడిచొచ్చే దేవుడువైనావు, కష్టం అంటే కరిగిపోయావు, అవసరం అంటే అక్కున చేర్చు కున్నావు ...

ఎప్పుడెప్పుడు సెలవు నుండి వచ్చి నీ ప్రేమ పలకరింపులతో , "మధుర" మిఠాయిలు తినిపిస్తావని ఎదురుచూసాము ...

నా అన్నవారే రాని నేటి పెళ్లిళ్లకు , ఎంత దూరం ఉన్నా నీతో పని చేసిన ప్రతి వాడి పెళ్లికి ప్రేమతో , పెద్దవై వచ్చావు ...

మీ తరానికి పెద్ద దిక్కువై , మా తరానికి ఆదర్శానివై , పని చేసే చోట కూడా ప్రేమలు పంచవచ్చు అని పాటించి చూపావు ...

ఈ ఆనంత వాయువుల్లో కలిసి మాతోనే ఉంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తావని ఆశీస్తూ ...

అశ్రునివాళి

ఇలంగో సర్ కి ప్రేమతో

                                                                      మీ రెడ్డి

Monday, September 25, 2017

ఇండోనేషియాలో నా ఒంటరి తనం

ఉద్యోగరీత్యా విదేశాలలో ఒంటరిగా ఉన్న అయిన నా ఒంటరితనంలో నాకు తోడుగా ఉన్నకొంతమంది ఆజ్ఞాత స్నేహితులు



గోగినేని బాబు గారి హేతువాదం

రంగనాయకమ్మ గారి సౌమ్యవాదం

పట్టాభిరాం గారి ప్రయోజకత్వం

సందీప్ మహేశ్వర్ గారి ఉత్తేజత్వం

గరికపాటి గారి ఆలోచనాతత్వం

చాగంటి గారి పురాణతత్వం

youtube లో వీడియోలు

amazon prime లో కొత్త సినిమాలు

whatsapp లో ఊసులు

facebook లో పోస్ట్ లు

skype లో అమ్మతో మాటలు

కాగితాలతో కమ్మని స్నేహం

కలంతో మరింత పరిచయం

ఆంగ్లంలో Robin Sharma , Preeti Sheoney, Chetan Bhagat నవలలు

రోజు రోజుకు పెరుగుతున్న బ్లాగ్ లో పోస్ట్ ల సంఖ్య

మెరుగైన నా ఫోటోగ్రఫి , కలిసి వచ్చిన సేఫ్టీ క్విజ్

చూసిన అద్భుత ప్రకృతి దృశ్యాలు

న్యూస్ హంట్ లో గోస్సిప్స్

బిగ్గ్ బాస్ షో క్రమం తప్పని దర్శనం

రోజు చిన్న నడక, నాలో మారుతున్న నడవడిక

చలం గారి ప్రేమ లేఖలు

భరద్వాజ్ గారి పాకుడురాళ్లు

నాతో ఎల్లప్పుడూ ఉండే నా శ్రీ శ్రీ

నాలో మేలుకుంటున్న ఒంటరి శ్రీ

ప్రయాణ బడలికలో పాట్లు

విమానల కోసం వెదుకులాట్లు

check in , check out లో చిక్కులు

immigration లో irritation లు

క్రొత్త క్రొత్త హోటల్స్

కొంగొత్త పరిచయాలు

Pak , Ibu లతో కలిపిన మాటలు

చెప్పక ముందే పనిచేసే కాంట్రాక్టర్లు

చెప్పినా పట్టించుకోని క్లైంట్ లు

క్రమం తప్పని మీటింగ్ లు

ఏ రోజు తప్పని భోజన వేళలు

విదేశాలలో వింత పోకడకి ఇమడలేని తనం

స్వదేశంలో స్వంత వారి కోసం మరువలేని ఆరాటం

ఇది ఇండోనేషియాలోని నా ఒంటరి తనం

Monday, September 11, 2017

నా స్కూల్



 

కల్మషం లేని లేత కలువుల నెలవైన కోవెల కోనేరు నా స్కూల్...

బుడిబుడి అడుగులు గాడి తప్పక గమ్యాన్ని చేర్చిన మనోరథం నా స్కూల్...

అక్షరమే ని జీవనాధారం , అన్య ఆయుధం అవసరం లేదని చెప్పిన రణ భూమి నా స్కూల్...

మతాల మత్తు, కులాల కంపులు ఊసులు దరిచేరనివ్వని ఉద్యానవనం నా స్కూల్...

మట్టి నుంచి మాణిక్యాలను , మనిషి నుంచి మహనీయులు రూపొందించిన కర్మాగారం నా స్కూల్...

ఎంతెత్తు ఎదిగినా, మూలాలు నావే అని గర్వాపడే పవిత్రక్షేత్రం నా స్కూల్...

చెలిమి హస్తాలు, చెరగని జ్ఞాపకాల స్మృతిపథం నా స్కూల్…

ఈ మహానగరానికి చెక్కు చెదరని చరిత్రను లిఖించటానికి ఎందరినో అందించినది నా స్కూల్...

Sunday, September 3, 2017

నాకు కావాలి



 

నాకు కావాలి... అర్ధాకలితో, నడిరోడ్డున నిదురించే అభాగ్యులు లేని దేశం...

నాకు కావాలి... ఆర్ద్రత నిండిన గుండెలతో ఆప్తుల కోసం ఎదురుచూసే వయోవృద్దులు లేని వృద్దాశ్రమాలు...

నాకు కావాలి... దానంచేద్దాం అంటే తీసుకునే దరిద్రులు లేని ధనికదేశము...

నాకు కావాలి... కావలి కాసే అన్నలు అక్కరలేని స్వేచ్చ, స్వాతంత్ర్యాలతో తిరిగే చెల్లెల స్వరాజ్యము...

నాకు కావాలి... చిమ్మ చీకట్లలో ఛిద్రమైపోతున్నా, పడుపు పడతలు లేని ప్రపంచము...

నాకు కావాలి... శాంతి,సౌభ్రాతృత్వం, సమానత్వముతో నిండిన ఆర్ధిక అసమానతలు లేని రాజ్యాలు...

నాకు కావాలి... పచ్చని పైరులు, సాగే సెలయేరులు, కోయిల గానాలు, గోవుల సందడితో నిండిన పల్లెలు...

నాకు కావాలి... అక్రమ సంతతికి ఆనవాళ్ళు కానీ,కన్నప్రేగును పోషించలేమని నిర్దయగానీ లేని అనాధశరణలయాలు...

నాకు కావాలి... శ్రమను దోచని యజమానులు,పనినే దైవముగా భావించే కార్మికులు..అంతా ఒకకుటుంబమే అని తలచే పారిశ్రామిక వాడలు...

నాకు కావాలి... ప్రతిపక్షలకు ప్రాధాన్యత ఇచ్చే, పార్టీ ,పదవులు కన్నా ప్రజశ్రేయాస్సు ముఖ్యామనుకొనే రాజకీయం పార్టీలు...

నాకు కావాలి... అభివృద్ధికి ఆనవాళ్ళుగా, ప్రకృతికి, పారిశ్రామికతకు పట్టుకొమ్మలుగా, జనహితం కోరే నవ సమాజము...