Friday, August 25, 2017

నాకు ఇష్టం



సముద్రం అంటే నాకు ఇష్టం ,

ఎగసిపడే కెరటాలు ఉన్నాయని కాదు, పడిన లేచే కెరటాలు ఉన్నాయని... 



కలాం గారు అంటే నాకు ఇష్టం ,

అంతరిక్ష శాస్త్రవేత్త ఉన్నాడని కాదు అతని అంతరంగంలో నా అధ్యాపకుడు ఉన్నాడని... 



శ్రీ శ్రీ గారు అంటే నాకు ఇష్టం ,

కవిత్వం రాస్తారని కాదు , తాను అనుకున్నది నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెప్తారని... 



చెట్లు అంటే నాకు ఇష్టం ,

ఎదుగుతున్నాయని కాదు ఎదిగినా ఒదిగి ఉండమని నేర్పిస్తున్నాయని... 



కొండలు ,లోయలు అంటే నాకు ఇష్టం,

అద్భుత అందాలకు ఆటవిడుపులని కాదు, నీ అంతరంగంలో ఎత్తుపల్లాలను తెలుసుకోమని చెప్తున్నాయని... 



ఉషోదయం అంటే నాకు ఇష్టం ,

చిమ్మ చీకట్లు పారద్రోలుతుందని కాదు, ప్రతి రోజు నాలో సరికొత్త వ్యక్తిని నాకు పరిచయం చేస్తుందని ... 



వెన్నెల రాత్రులు అంటే నాకు ఇష్టం,

తారల అందచందాలను ఇనుమడింప చేస్తుందని కాదు, నాలో ప్రశాంతతను నాకు పరిచయం చేస్తుందని... 



జీవితం అంటే నాకు ఇష్టం,

ఏదోలా బ్రతికేయాలని ఆశతో కాదు, ప్రతి రోజు ఒక కొత్త పాఠం నేర్పుతుందని...

 

శ్మశానం అంటే నాకు ఇష్టం,

ఆఖరి మజిలీ అవుతుందని కాదు, సమానత్వానికి సముచిత స్థానం ఇస్తుందని...

 

అమ్మ, నాన్న, గురువు, తెలుగు అంటే నాకు ఇష్టం ,

ఏదో ఒకటి చెపుదామని కాదు, ఈ ఇష్టాలకు కారణాలు చెప్పలేనన్ని ఉన్నాయని...

Saturday, August 19, 2017

అమ్మ



 “మమ్మల్ని నిలబెట్టటానికి నడికట్టు కట్టుకున్న అమ్మ ఇవాళ తానే వంగిపోయింది” అని

దాసోజు జ్ఞానేశ్వర్ గారి కవిత చదివినప్పుడు కలిగిన అనుభూతితో నాకు తోచిన మాటలు అమ్మకోసం...

                                                     అమ్మ

అనంత విశ్వంలో ఉన్న నన్ను ఆత్మీయంగా నీ గర్భాన చేర్చుకున్నావా...

అవస్థలెన్నో పడ్డావు ఆనందంగా, అండనై నీకు అండగా ఉన్నాననా ...

వికారంగా ఉన్నా, వాంతులు వస్తున్నా బహుప్రీతితో భరించావు, బాహ్యప్రపంచంలో నా రాకకై ఎదురుచూస్తూ...

శరీరం సహకరించాకున్నా, ఆకృతి మారిపోతున్నా, నా చిన్నిరూపం కోసం ఆలోచిస్తూ ఆనందంగా గడిపేసావా...

ఈ జన్మను నాకు ఇచ్చి, మరుజన్మ నువ్వు ఎత్తి, నన్ను చూసి మురిపంగా మురిసిపోయావా...

పత్యలు అంటూ పట్టిడన్నం పెడుతున్నా, పక్కను నేను పదే పదే తడిపేస్తున్నా పక్కనే ఉన్న నన్ను చూసి పరవశించి పోయావా...

రేయి, పగలు తేడా లేకుండా నేను ఏడుస్తూ, నిన్నుఏడిపిస్తుంటే, తండ్రి ఏ కష్టం వచ్చిందని చనుపాలను నా అధరాలకు అందించి ఆనందపడిపోయావా ...

మేము అమ్మనాన్నలం అయితే అప్పుడు తెలిసింది నిజమైన అమ్మతనం

స్కానింగ్ లో ఆ చిన్ని కణాన్ని చూసి పొంగిపోయిన క్షణాన గుర్తొచింది నువ్వే...

ఆ నవమాసాలు నా భార్యను చూస్తున్న ప్రతి క్షణం మదిలో మెదిలింది నువ్వే...

మమ్మల్ని కన్న తరువాత నువ్వు నువ్వుగా నిలబడటానికి నడికట్టు కట్టుకున్న...

నేడు మమ్మల్ని మా కాళ్ళ మీద నిలబెట్టి నువ్వు నిలబడ లేక వంగిపోతున్నావా ...

నీ గుండె లయ వింటూ పోసుకున్న ఈ ప్రాణం, నా ఆఖరి గుండె చప్పుడు వరకు నిను పూజిస్తూనే ఉంటుంది...

గుడి నీకు కడతానని చెప్పను గాని , ఈ నా గుండె కొట్టుకున్నంత వరకు గుండెల్లో పెట్టుకుంటాను ...

నేనెవరు





నిశీధి తిమిరాలను చీల్చుకొని తొలి ఉషోదయ కిరణాలు నేలను తాకిన ఆ క్షణాన, మెల్లగా సాగర గర్భం నుంచి వస్తున్న ఉదయభానుడిని చూస్తూ సాగర తీరాన నడుచుకుంటూ వెళ్తుంటే, ఎందుకో అనిపించింది నేను ఎవరు అని ఎప్పుడో ఎవరో చెప్పితే విన్న మాటలు... ఇప్పుడు చదువుతున్న పుస్తకం...అనుభవించిన జీవిత మధనంలో వచ్చిన ఆలోచనలు...

అవును నేనెవరు...?

అమ్మ కడుపులో అణువు అంత నుంచి కంటికి కనిపించే ఈ ఆకారం వరకు,

నిశీధి, నిర్మానుష కుహరములో నవమాసాలు అమ్మ గుండెలయ సాక్షిగా, ఉమ్మనిరుతో బ్రతికింది నేనేనా...

అణువు నుంచి ఆకాశహర్మ్యాలను తాకగలిగే ఈ అనంత శక్తి సామర్ద్యాలు నాకు ఎక్కడవి...

నేనెవరు...?

ఏదో సాధించాలని, సాధించలేక చతికిలపడేది నేనేనా...

ఒకవేళ నేను చనిపోతే ఎక్కడకు వెళ్తాను...,

ఈ ఆనంత విశ్వంలో నేను మిళితం అయిపోతానా...

అంటే పుట్టేటప్పుడు ఈ ఆనంత విశ్వంలో నుంచి ఒక అణువునై వచ్చాను,

పోయేటప్పుడు మళ్ళీ ఈ అనంతం లో కలిసిపోతాను...

అంటే ఇప్పుడు కనిపిస్తుంది నేను కాదు,

ప్రాకృతిక శక్తిల సమ్మేళనం నేను...

సూర్యచంద్రాదుల శక్తి నా సొంతం...

సాగరగర్బాల ప్రకంపనల తీవ్రతల బలం నా సొంతం...

విత్తు నుంచి మహా వృక్షం ఉద్భవానికి ఉత్తేజం నా సొంతం...

నేను అనన్య సామాన్యం...

అనితరసాధ్యం...

సకల జగత్తు సంతోషమే నా అభిమతం...

చరాచర జీవకోటి సమాన దృష్టితో చూడడం నా కర్తవ్యం... 


అవును నేనే నేనే విశ్వమానవుడను…..

మన దేశం



ఏమైంది మన స్వాతంత్ర సమరయోదుల త్యాగఫలం...
 

ఏమైంది మన దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయం...

నిస్సిగ్గుగా, నీతి లేకుండా దోచేస్తున్న అధికారుల కనుసన్నలలో కనుమరుగై పోయిందా …

శ్వేత వర్ణ వస్త్రాలలో స్వేచ్ఛగా, అనైతికంగా అక్రమాలకు పాల్పడుతున్న వారి పాదక్రాంత మైపోయిందా…

మౌన నిద్రలో ఉన్న మేధావుల మేధస్సులో మసకబారి పోయిందా…

ఇక్కడ మన మేధావులు ఒక్కరు, పరాయి దేశాలలో ముగ్గురికి సమానం

మానవ వనరులలో ప్రపంచదేశాలలో ప్రధమస్థానం అయినా గత 70 యేళ్ళుగా ఆభివృద్ధి చెందుతూనే ఉన్నాము...

అలీన విధానానికి ఆయువుపట్టు మనము, పంచవర్ష ప్రణాళికలకు ప్రాకారం మనము అయినా ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు...

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినా విద్యా, వైద్యం సామాన్యుడికి అందని ఆశనిపాతం...

ప్రపంచ ధనవంతుల జాబితాలో మనవాళ్ళు ఉంటారు కానీ ఇప్పటికి 23 కోట్ల మంది ఒంటిపూట మాత్రమే తినగలిగే స్థోమత...

ప్రపంచ మేధావుల జాబితాలో మనవాళ్ళు ఉంటారు కానీ ఇప్పటికి 20 శాతం మంది నిరక్షరాస్యులు గానే ఉన్నాము...

ఎన్నాళ్ళు ఇలా, ఎన్నేళ్ళు ఇలా నల్లధనాన్ని నామరూపాలు లేకుండా చెయ్యలేమా...

నిర్వీర్యం అయిపోతున్న విద్యావ్యవస్థను , మసకబారిపోతున్న యువత భవిష్యత్తును , లంచాగొండి తనము, కుల,మత,ప్రాంతీయ,బంధుప్రీతి వివక్షలను మార్చలేమా....

తప్పుకు తగిన కఠినమైన తక్షణ శిక్షలు అమలుపరచలేమా, ప్రాధమిక హక్కులు,విధులు సక్రమముగా నిర్వర్తిన్చాలేమా…

అప్పుడే అవుతుంది మన దేశం ఈ ప్రపంచానికి దిక్శుచి, పూర్వవైభానికి వాస్తవరూపం....

కవిత్వం



వాల్మీకి రామాయణానన్ని, పోతన భాగవతాన్ని మనకు అందించిన మాధ్యమం కవిత్వం

ఒక అనుభూతికి లోనైనప్పుడు మనస్సు స్పందించిన తీరు తెన్నులకు అక్షరరూపం కవిత్వం

ఒక చక్కని పుస్తకం చదివినప్పుడు కలిగిన ప్రేరణకి ప్రతిరూపం కవిత్వం

ఒక సంఘటన ఉహకొచ్చినప్పుడు మదిలో మెదిలే తొలిమాటల అల్లికే కవిత్వం

ప్రకృతిని చూసి ఆనందంతో ఆశువుగా జాలువారిన మాటల వెల్లువే కవిత్వం

ప్రేయసి ఉహల్లో ప్రియుడు పరవశించి పలికిన పలుకులే కవిత్వం

ప్రేయసి ప్రియుల ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రణయ పరామర్శల పలకరింపులే కవిత్వం

అన్యాయం, అక్రమము జరుగుతున్నపుడు పెల్లుబికిన ఆవేశపదజాలం కవిత్వం

జరుగుతున్న సామాజిక అసమానతలను వేలెత్తి చూపి, గొంతెత్తి పలికిన భావజాలమే కవిత్వం

కదిలే కెరటం,వికసించే పుష్పం,పసిపాప బోసినవ్వులు,గగనాన జాబిల్లి, నచ్చిన రచయితల నాలుగు మాటలు....ఇవన్నీ చూసినప్పుడు కలిగిన అనుభూతుల అక్షరమాలికే కవిత్వం

స్త్రీ వాదం, విప్లవ తత్వం, అణగారిన జనానికి అరుణ కిరణం, మూఢ విశ్వాశాలకి మత ఛాందసులకి చారణకులం ఇదే ఇదే కవిత్వం

ఏదో చేయాలన్న ఆవేశం, జాతి గమనాన్ని దేశ భవిష్యత్తును మార్చాలనే మహాసంకల్పమే కవిత్వం

రణ గొణ ధ్వనుల, ఆవిరి ఆర్తనాదాలు,లోహాలను అతికించే పరికరాల దేదీప్య కాంతుల మధ్య , ఏ మూలనో నాలో కలిగే భావనకి రూపమే కవిత్వం

ఎంతోమందికి ప్రేరణకి ప్రధమ రూపం, కొన్ని లక్షల జీవితాల ఆర్తికి అక్షర రూపం , కోట్ల మనస్సులకి నచ్చిన నేస్తం కవిత్వం

Monday, August 14, 2017

మన తెలుగు




ఏ దేశమేగినా, ఎందు కాలిడినా పొగడరా ననీ తల్లి భూమిభారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న సూక్తిని అనుసరించి ఎంతో మంది మహానుభావులు తమ తమ జీవితాలను ఈ భరతమాత కి అంకితం చేశారు.

ఎక్కడో దక్షిణాఫ్రికాలో, ఉన్నత హోదాలో ఉంటూ కూడా తన దేశ దాస్యశృంఖలాలను త్యజించాలని బాపు చేసిన కృషి...

తన దేశ బానిస సంకెళ్లను తెంచి, ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించినా, తమ లాంటి కష్టము ప్రపంచము లో ఏ దేశనికి రాకూడదని నమ్ముకున్న సిద్దాంతం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన చే గువేరా త్యాగం...

ఎక్కడో యుగొస్లేవియాలో పుట్టి, భారతదేశ గడ్డమీద రోగుల అవస్థలు చూడలేక , ఈ దేశ పౌరసత్వం తీసుకొని తుదిశ్వాస వరకు తన ఆశయసిద్ది కొరకు అహర్నిశలు శ్రమించిన మదర్ తెరిస్సా...

పన్నులు వసూలు చెయ్యటానికి ఒక బ్రిటీష్ అధికారిగా వచ్చి, గోదావరి వల్ల వస్తున్న ఉప్పెనలు, వరదల వల్ల ప్రజలు పడుతున్న అగచాట్లు చూసి, తనకు ఏవిధమైన సంబంధం లేక పోయినా వంతెన కట్టి వరాల గోదారిగా మార్చిన సర్ కాటన్ దొర...

ఇలా కొన్ని వందల సంఖ్యలో ఈ దేశం కోసం, తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం తమ జీవితాలను అంకితం చేసి, ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన మహానుభావులు పుట్టిన ఈ గడ్డలో వారిని అనుసరించక పోయినా పరవాలేదు కానీ వాటికి వ్యతిరేకముగా చేయడం ఎంత వరకు సమంజసం...

తెలుగు దేశ చరిత్ర కీర్తికి, ఖ్యాతికి మూలమైన తెలుగు భాషనే సమూలంగా, కూకటివేళ్ళతో పెకళించాలన్న, మీ అధికార అహంభావం ఎంత వరకు సమంజసం...

ఆధునికతను, అన్య భాషలను నేర్చుకోమని మేము అనలేదే, అవి నేర్చుకున్నంత మాత్రాన మన మనుగడకు, పుట్టుకకు కారణమైన మన మూలలను తుడిచిపెట్టమని ఎవరు చెప్పారు...

పట్టణాల్లో ఇల్లు కట్టుకున్నామని , ఆంగ్లం లో మాట్లాడుతున్నామని , మనము పుట్టిన ఊరు వెళ్లడం మనేస్తున్నామా, మనవారితో కమ్మగా తెలుగులో మాట్లాడడం మరిచిపోయామా, అప్పుడు కలిగే ఆనందం, అనుభూతి ఎక్కడయ్యా పట్టణ, పాశ్చాత్య సంస్కృతిలో దొరుకుతుంది...

తల్లి రొమ్ము పాలు తాగిన తొలుచూరు కొడుకు, వాటి అవసరం తీరిందని తరువాత పిల్లలకు లేకుండా ఆ రొమ్ములనే కోసేయాలన్న చందంగా ఉంది మీ ఆలోచన ...

ఒకసారి అధికార అహంతో కాకుండా ఈ జాతి బిడ్డగా, ఒక తెలుగు తల్లి కొడుకుగా ఆలోచించుకో చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోవాలో, చరిత్రహీనుడుగా ఉండిపోవాలో నిర్ణయించుకో ...

ఎందుకంటే ఈ పదవులు , ప్రాపకాలు ఎంతవరకు ఉంటాయో ఎవరికకీ తెలియదు , నీ లాంటి వాళ్ళు అనేకులు నువ్వు కూర్చున్న అదే కుర్చీలో, కూర్చొని వెళ్లి పోయారు...

అందుకే నిర్ణయించుకో

నీ మరణానికి ముందు నువ్వు తీసుకునే ఈ నిర్ణయం వల్ల పశ్చాత్తాపమో, పరమానందమో నీవే నిర్ణయించుకో...