ఓం నమో వేంకటేశాయ నమః
ఎన్ని నేర్పావయ్య ఒక యాత్రలో నా కళ్ళతో నేను చూడకూడదు నా పిల్లల జీవితం లో అనుకున్నవి , కష్టం కన్నెరెగని నా కనుపాపలకు నా కళ్ళ ముందే కటిక నేల మీద నిదురించేలా చేశావు
అనుకోని అవాంతరాలు చిన్న చిన్నవెన్నో నువ్వే కల్పించావు, అంతలోనే అందమైన ముగింపు ఇచ్చావు
ఎప్పుడో చిన్నప్పుడు గోవింద నామస్మరణ చేస్తూ నిన్ను దర్శించు కునే మాకు పెరిగి , పెద్దవాళ్ళయి పోయాము, మనసులో బిడియపడుతుంటే నా కొడుకు తో నోరారా " గోవిందా గోవిందా గోకుల నందన గోవిందా " అని నీ నామాన్ని పలికించి , నన్ను కూడా వాడితో వంతపాడించావు
నిన్ను చేరే దారిలో అడుగడుగునా ఆపుతుంటే , అసహనానికి గురవుతుంటే అప్పుడు అర్థం అయింది , గమ్యం చేరడం ముఖ్యం కాదు ఆ గమనం ఎంత సంతృప్తి గా చేశామన్నది ముఖ్యం అని ఎందుకంటే చిరాకు పడుతూ లైన్ లో వెళ్లినవాడు , చిద్విలాసంగా నీ నామాన్ని స్మరిస్తూ వెళ్లినవాడు నిన్ను చూసేది ఆ ఒక్క నిమిషం కదా...
ఎక్కడో అస్సాం లో ఏదో అలజడి అని రేణిగుంట లో ఎక్కబోయే ట్రైన్ నిలిపేశారు. ఎటూ వెళ్ళాలో తేల్చుకోలేని వేళ కాని వేళలో , అంతలోనే ఆవేశం , ఏదో తెలియని కోపం , వ్యవస్థ మీద వెగటు ధర్నా కి కూర్చున్నాం కానీ ఆ ఆవేశం ఒక గంట మాత్రమే. మళ్లీ సగటు మనిషి సామాన్య పరిస్థితులు పిల్లలు , ఉద్యోగం , బాధ్యతలు
ఒక గంటలో 25 మంది 7 గురు గా పరిణామం. పోలీసులు పాతిక మంది చేసేది లేదు. సత్వర న్యాయం అసలే దొరకని దేశం. భావాలు గాలికి వదిలేసి బాధ్యతగా పిల్లలను , వెంట తెచ్చుకున్న సామాన్లను మోసుకుంటూ మరో ప్రయాణం.
ధనం, కాలం కరిగిపోతున్నాయి. కానీ వాటి కన్నా ఎంతో విలువైన జీవిత పాఠం నేర్పావు.
సమయానుసారంగా నిర్ణయం తీసుకోవడం , దేనికి విలువ ఇవ్వాలో మన చేతుల్లోనే ఉందని మరో సారి వెన్ను తట్టి గుర్తు చేశావు ...
*" ఓం నమో వెంకటేశ నమః"*