మొన్నటికి మొన్న ఆశిఫా కోసం
అందరూ గొంతు కలిపి పసిపిల్లలు మీద లైంగిక దాడులపై అక్షర యుద్దం చేశాం
అంతకు ముందు కడుపు నిండి , కండ కావరం తో,
ఆకలి గొన్న గిరిజనుడు చేసిన చిన్న తప్పుకు మరణాన్ని బహూకరించిన పెత్తందారులపై కలం పదును చూపెట్టాం
పరువు హత్యల పైన, తల్లిదండ్రుల మానసిక క్షోభ మీద పదునైన పదజాలమే వాడాం
ఇప్పుడు మీ టూ అంటూ గొంతెత్తిన వారికి కొండంత అండగా, ఆసరా చూపిస్తూ అక్షరాలతో మేము తోడు ఉన్నామని ఆప్యాయం గా పలకరిస్తున్నాం
అవకాశం ఉన్నప్పుడు కుళ్ళు రాజకీయాల మీద , కుల వ్యవస్థల మీద , సభ్య సమాజం సిగ్గు పడేట్లు చేస్తున్నవారి మీద అక్షరాలనే అణ్వాయుధాలు సంధిస్తూనే ఉన్నాం
అయినా మారలేదు వ్యవస్థ , ఒక సమస్య తరువాత ఒకటి , ఒక హేయమైన చర్య తరువాత మరొక జుగప్సాకరమైన సంఘటన
కారణాలు అనేకం కాని మూలం ఒకటే ఎవరి పని వారు సక్రమంగా చెయ్యకపోవడం...
చట్టాలు ఉన్నాయి కానీ చుట్టాల కోసం వదిలేస్తాం...
హక్కులు కావాలి కానీ బాధ్యతలు సక్రమముగా నిర్వర్తించం
రాజ్యాంగం చదువుకుంటాం , పాఠ్యాంశాలలో పది మార్కుల ప్రశ్నగానే...
కానీ పాటించాలనే ఇంగిత జ్ఞానం లేకుండా...
నీతులు చెప్పి పాటించని వాడిని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా అమలు చేయని వాడిని,
అధికారాన్ని అవకాశం కోసం వాడుకున్నవాడిని నిలువునా చిల్చేస్తే
అప్పుడు పోతుంది నా దేశం నుండి ఈ దరిద్రం, దౌర్భాగ్యం
అప్పుడు మన కలలు నుండి ఆకాశపు అంచుల అందాలు, నదీనదాల హొయలు,
ప్రకృతి పరిక్రమాల పరిబాషలు మూకుమ్మడిగా వస్తాయి
అప్పుడు ఈ అక్షర యుద్ధానికి ఒక అర్థం, పరమార్ధం చేకూరుతుంది
No comments:
Post a Comment