Tuesday, January 9, 2018

నేటి రాజకీయము...



  అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
అణ్వాయుధాలు మనకు అవసరమా...


వీధి బడుల్లో విద్య మూతపడుతుంటే
విజ్ఞానం కోసం విశ్వం తో పోటీనా...


ఆక్సిజన్ అందక అశువులు బాస్తుంటే
ఇంకా వికసించని కుసుమాలు ,
గతించిన వారి ఘనకీర్తికి
విశ్వమంతా విగ్రహలు కావాలా...


కాలినడకకే కూలిపోయే వంతెనలు
 పక్షానికే పట్టాలు తప్పే ట్రైన్లు
ఉన్న దేశంలో, ఏల అవసరం వచ్చే బుల్లెట్ ట్రైన్లు...


పల్లె ప్రాణాలు రెప రెప లాడుతుంటే
 పట్టెడన్నం పండించేవాడు ప్రాణాలు తీసుకుంటే
 సోయగాల సుందర నగరాలు కావాలా...


వీనుల విందుగా ఉంటేగాని విననని
 విమర్శించే ప్రతివాడు విద్రోహక శక్తి అని
భక్తజనుల బావి లో మండూకం అయితే
నీ భవిష్యత్ ఇంకా అంత అంధకారమే...


అధికారం వచ్చిందో లేదో
 చేసింది ఏమిటో తెలియదు
కానీ అంతలోనే గద్దె కోసం పాట్లు
 మరలోచ్చే ఎన్నికల కోసం అగచాట్లు ...


ఆకలన్న వాడికి అన్నం కావాలి కానీ
కనక కంచాలు ఏల
 కళ్ల తృప్తి కడుపు నింపదు కదా...


కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి
పుట్టగొడుగులవోలె
నాయకులు మాత్రం వారే
కోతికొమ్మచ్చులు ఆడుకుంటూ
 చేరెను మళ్ళి ఒకచోట ...


టీవీని పెట్టేది ఒకడు , పేపర్ పట్టేది ఒకడు
 ఆర్బాటంగా కబుర్లు చెప్పేది ఇంకొక్కడు
స్కాములు చేసినవాడు దేశాన్ని ఉద్దరిస్తానంటాడు
ఆస్తులు కూడబెట్టినవాడు ఆదర్శంగా పాలిస్తానంటాడు
 అది విని మనవారు గొర్రెలై అనుసరిస్తారూ ...


ప్రాంతానికి, కులానికి, మతానికి ఒక నాయకుడు
 ప్రాధాన్యం లేకపొతే కొత్త పార్టీ
ఎక్కడుంది ప్రజల మీద ప్రేమ
దేశానికి సేవ చెయ్యాలనే ఆశ ...


ఇదే ఇదే మన నవ భారత స్వాతంత్రపు
సరికొత్త రాజకీయము