Monday, August 14, 2017

మన తెలుగు




ఏ దేశమేగినా, ఎందు కాలిడినా పొగడరా ననీ తల్లి భూమిభారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న సూక్తిని అనుసరించి ఎంతో మంది మహానుభావులు తమ తమ జీవితాలను ఈ భరతమాత కి అంకితం చేశారు.

ఎక్కడో దక్షిణాఫ్రికాలో, ఉన్నత హోదాలో ఉంటూ కూడా తన దేశ దాస్యశృంఖలాలను త్యజించాలని బాపు చేసిన కృషి...

తన దేశ బానిస సంకెళ్లను తెంచి, ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించినా, తమ లాంటి కష్టము ప్రపంచము లో ఏ దేశనికి రాకూడదని నమ్ముకున్న సిద్దాంతం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన చే గువేరా త్యాగం...

ఎక్కడో యుగొస్లేవియాలో పుట్టి, భారతదేశ గడ్డమీద రోగుల అవస్థలు చూడలేక , ఈ దేశ పౌరసత్వం తీసుకొని తుదిశ్వాస వరకు తన ఆశయసిద్ది కొరకు అహర్నిశలు శ్రమించిన మదర్ తెరిస్సా...

పన్నులు వసూలు చెయ్యటానికి ఒక బ్రిటీష్ అధికారిగా వచ్చి, గోదావరి వల్ల వస్తున్న ఉప్పెనలు, వరదల వల్ల ప్రజలు పడుతున్న అగచాట్లు చూసి, తనకు ఏవిధమైన సంబంధం లేక పోయినా వంతెన కట్టి వరాల గోదారిగా మార్చిన సర్ కాటన్ దొర...

ఇలా కొన్ని వందల సంఖ్యలో ఈ దేశం కోసం, తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం తమ జీవితాలను అంకితం చేసి, ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన మహానుభావులు పుట్టిన ఈ గడ్డలో వారిని అనుసరించక పోయినా పరవాలేదు కానీ వాటికి వ్యతిరేకముగా చేయడం ఎంత వరకు సమంజసం...

తెలుగు దేశ చరిత్ర కీర్తికి, ఖ్యాతికి మూలమైన తెలుగు భాషనే సమూలంగా, కూకటివేళ్ళతో పెకళించాలన్న, మీ అధికార అహంభావం ఎంత వరకు సమంజసం...

ఆధునికతను, అన్య భాషలను నేర్చుకోమని మేము అనలేదే, అవి నేర్చుకున్నంత మాత్రాన మన మనుగడకు, పుట్టుకకు కారణమైన మన మూలలను తుడిచిపెట్టమని ఎవరు చెప్పారు...

పట్టణాల్లో ఇల్లు కట్టుకున్నామని , ఆంగ్లం లో మాట్లాడుతున్నామని , మనము పుట్టిన ఊరు వెళ్లడం మనేస్తున్నామా, మనవారితో కమ్మగా తెలుగులో మాట్లాడడం మరిచిపోయామా, అప్పుడు కలిగే ఆనందం, అనుభూతి ఎక్కడయ్యా పట్టణ, పాశ్చాత్య సంస్కృతిలో దొరుకుతుంది...

తల్లి రొమ్ము పాలు తాగిన తొలుచూరు కొడుకు, వాటి అవసరం తీరిందని తరువాత పిల్లలకు లేకుండా ఆ రొమ్ములనే కోసేయాలన్న చందంగా ఉంది మీ ఆలోచన ...

ఒకసారి అధికార అహంతో కాకుండా ఈ జాతి బిడ్డగా, ఒక తెలుగు తల్లి కొడుకుగా ఆలోచించుకో చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోవాలో, చరిత్రహీనుడుగా ఉండిపోవాలో నిర్ణయించుకో ...

ఎందుకంటే ఈ పదవులు , ప్రాపకాలు ఎంతవరకు ఉంటాయో ఎవరికకీ తెలియదు , నీ లాంటి వాళ్ళు అనేకులు నువ్వు కూర్చున్న అదే కుర్చీలో, కూర్చొని వెళ్లి పోయారు...

అందుకే నిర్ణయించుకో

నీ మరణానికి ముందు నువ్వు తీసుకునే ఈ నిర్ణయం వల్ల పశ్చాత్తాపమో, పరమానందమో నీవే నిర్ణయించుకో...

No comments: