Wednesday, May 17, 2017

దేవుడంటే

దేవుడంటే కాదు మందిరాలలో, మౌనముద్రలో పంచలోహాలతో , ప్రాకారాల మధ్య పంచామృత అభిషేకాలను ఆస్వాదించే విగ్రహమూర్తులు

దేవుడంటే కాదు పూలపల్లకీలలో, అగరత్తుల సువాసనల మధ్య, పంచభక్ష పరవన్నాలు సేవిస్తూ, మేలుకొలుపు, ఏకాంత సేవలు చేయించుకొని, బంగారపు ఉయ్యాలలో శయనించేవాడు

దేవుడంటే కాదు భజనరాయుళ్ళ మధ్య, మంత్రాల మత్తుతో, శ్లోకాల సోయగంతో సొమ్మసిల్లి , వినువీధుల్లో విహరించే ఉత్సవవిగ్రహాలు

దేవుడంటే కాదు ధనవంతుల పుజామందిరాలలో,శుచి శుభ్రతలతో , నిత్య పూజ, పునఃస్కారాలతో, విలసిల్లె విలాసావంతుడు

దేవుడంటే ఆపదలో ఉన్న వాడికి తాను ఎవరు అని చూడకుండా, తనకి తోచిన సాయం చేసిన అజ్ఞాత వ్యక్తి మదిలో ఉన్నవాడు

దేవుడంటే తన వృత్తి ధర్మాన్నే బాధ్యతగా నిర్వహించి,మరి ఇతర ప్రతిఫలాపేక్ష లేకుండా విధి నిర్వహణ నిజాయితీగా చేసిన ప్రతి వాడిలో ఉన్నవాడు

దేవుడంటే  పసిపిల్లల ఆర్తనాదం విని , పనులన్నీ పక్కనపెట్టి పరుగు పరుగున వచ్చే  ప్రతి అమ్మ మనసులో ఉన్నవాడు


దేవుడంటే పక్కవాడి ఆకలికి తల్లడిల్లి పోయి తన వద్ద ఉన్నదానిలో సగం పంచుకునేవాడు, కష్టపడి పనిచేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించే ప్రతికూలి వాడి చెమటలో ఉన్నవాడు

No comments: