Wednesday, May 17, 2017

స్వాతంత్రము



ఎవరు ఇచ్చింది స్వాతంత్రం,ఎవరు తెచ్చుకున్నది ఈ స్వాతంత్రం,70 ఏళ్ల స్వాతంత్రంలో రూపాయి సుమారుగా అన్నేరెట్లు పడిపోయింది --- ఇదేనా స్వాతంత్రము

రాజ్యాలు పోయాయి, రాజులూ పోయారు,రాష్ట్రాలు వచ్చాయి, రాజకీయ నాయకులూ వచ్చారు కానీ స్వాతంత్రము మాత్రం స్వప్నంగానే మిగిలిపోయింది --- ఇదేనా స్వాతంత్రము

దిన పత్రికలు తెరిస్తే ఒక అవమానం, మరో మానభంగం, మంత్రుల స్కాములు, స్వాముల స్వాహాలు --- ఇదేనా స్వాతంత్రము

ఇంకెన్నాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉంటాము, మన ముందు కళ్ళు తెరిచిన పసికూనలు, అభివృద్ది కోసం మనకు పాఠాలు నేర్పిస్తున్నారు, ఆటల్లో మనల్ని అవలీలగా ఎప్పుడో దాటేసారు ఇంకా మనము అక్కడే ఉన్నాము, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, కుల, మత, వర్గ వైషమ్యాలు --- ఇదేనా స్వాతంత్రము

ఇక్కడి  మేధావులు  వలస పోయి, పరాయి దేశాలలో ఆద్బుతాలు సృష్టిస్తున్నారు, మరల మన దేశానికీ వస్తే ఎక్కడ తమ సామర్ధ్యాలకు అవిటితనం ఆపాదిస్తారో అని భయపడుతున్నారు--- ఇదేనా స్వాతంత్రము

తలసరి ఆదాయం పెరిగింది, సగటున పేదరికం పెరిగింది, మానవత్వం మరుగునపడిపోయింది, అవకాశం వస్తే భూమ్యాకాశాలను సైతం కబళించచేద్దామన్న ఆశావాదం వంటపట్టింది--- ఇదేనా స్వాతంత్రము

అంగారక గ్రహానికి విజయవంతంగా విహంగ వీక్షణం చేసిన మనం ప్రక్క వాడి ఆకలి భాదను తీర్చలేక పోతున్నాము, కన్న తల్లితండ్రులను కనుపాపలుగా చూసుకోవలసిన మనము వారిని వృద్దాశ్రమాలలో వదిలేస్తున్నాము--- ఇదేనా స్వాతంత్రము

మన దేశ మాజీ ప్రధమ పౌరుని ఆస్తి వివరాలు (6 షర్ట్స్,3 పాంట్స్,2 సూట్లు, 2500  బుక్స్) చూస్తుంటే మన గల్లీలో తిరిగే చిరు రాజకీయ నాయకుడు సైతము ఎంతో సంపన్నుడు, మంత్రులు అయితే సరేసరి ఇంకా మిగత వారికోసం చెప్పనక్కరలేదు--- ఇదేనా స్వాతంత్రము

సౌభ్రాతృత్వ సమానత్వ సమాజం కావాలంటే అవకాశాలు అందరికీ సమానంగా కల్పించాలి,అధికారం, అందలం సామర్ధ్యాన్ని బట్టే కానీ మరే ప్రాతిపదిక లేనప్పుడు, మహనీయులు కలలు కన్న స్వాతంత్రము సిద్ధిస్తుంది

బ్రతకటానికి లక్షలు,వేల కోట్లు అవసరము లేదు, నీ వృత్తిని నియమనిబద్ధతతో చేసుకుంటూ, సొంత లాభం కొంత మానుకొని పక్కవాడికి సాయపడుతూ ఉంటే, ఈ దేశ ప్రగతికి నీ వంతు చేసిన వాడివి ఆవుతావు, విశ్వజగత్తులో మనదేశ పతాకానికి సగర్వంగా సముచిత స్థానం కల్పించిన వాడివి అవుతావు అప్పుడు అది నిజమైన  స్వాతంత్రము.

No comments: