Thursday, May 18, 2017

నాటి జ్ఞాపకాలు



నాటి జ్ఞాపకాలు నేడు తలుచుకుంటే మరపురాని మధురానుభూతులు, కాలగర్భంలో మరెన్నో మధుర క్షణాలు...

పంచుకోటానికి నీలాంటి స్నేహితుడు ఉంటే , నాటి మాటలు చెప్పుకోటానికి అంతం ఎక్కడ ఉంటున్ది...

ఆధునికతకు , అమ్మమ్మ,తాతయ్యల ఆప్యాయతను అనుభవించినా ఆ తరానికి గుర్తులము అని గర్విద్దాము
ఎంతో కొంత వీలైతే మన భావితరానికి పంచిద్దాం...

నడినెత్తున సూరీడు ఉన్నా, చొక్కాలు మట్టికోట్టుకుపోతున్నా, పరిగెడుతూ పడిపోతున్నాఅలుపెరుగక ఆడిన ఆటలు...

మద్యాహ్నం పడుకోమని అమ్మచేపితే , అమ్మ పడుకున్నంత వరకు ఎదురుచూసి మెల్లగా పిల్లిలాగా జారుకొని గోడమీద నేను ఆటకి వెళ్తున్నాని రాసినప్పుడు, అది చూసి చెల్లి అమ్మకి చెప్పిన మాటలు...

మండు వేసవిలో అరుగు మీద అమ్మతో పాటుగా, వీధిలో అక్కలు,అత్తలు,అమ్మమ్మలు కొంత మంది బియ్యం ఏరుతుండగా , మరి కొంత మంది చింతపండు పిక్కలు తీస్తుంటే , పిల్లలు అందరం మనకి తోచిన సాయం చేస్తూ, చింత పిక్కలతో ఆడుకున్న ఆరోజులు ...

సాయంత్ర సమయాన , వీధి బయట రోడ్డూ మిద ఆడుకుంటున్నపుడు, అటుగా వెళ్తున్నా ప్రైవేటు మాస్టర్ ని చూసి భయపడి, పరిగెత్తి దాక్కున్న క్షణాలు...

వారానికి ఒక్కసారి వచ్చే చిత్రలహరి కోసం ఎదురుచూస్తూ , పరిగెత్తి టీవీల ముందు కూర్చున్నపుడు వచ్చే 6 పాటలను
దాదాపుగా 60 ప్రకటనలు వచ్చిన ఆనందంగా చూసిన రోజులు...

చెప్పాలని ఉంది నేస్తం నాటి జ్ఞాపకాల దొంతరాలలో ఊసులు ఎన్నో, కానీ నాటి అనుభవాల ముందు నా మాటలు చిన్నబోతున్నాయి...

నా విశాఖ


విశాల సాగర వీక్షణం, విశ్వ విద్యకు, విద్వత్ కు, పెట్టని ప్రకృతి అందాలకు పట్టుకొమ్మ,ఆంధ్రమాత సిగలో తలమానికం...

పరమ శివుని ప్రాపకంతో కైలాసగిరి అందాలు కనుల ముందు సాక్షాత్కరించి, కొండ కోనల సోయగాలు అనంతంగా అనంతగిరిలో అమర్చుకొని ముస్తాబు అయినది నా విశాఖ...

సాగర తీర సముదాయాల సమాహారం...

ప్రాకృతిక పర్వతాలప్రాకారం...

మన్య వీరుని మనకందించిన మహా నగరం ...

సినీ వినీలాకాశంలో విశిష్ట స్థానం...

కవిత్వాన్ని ఖండించి,శాసించిన నా శ్రీశ్రీ ని తెలుగుభాషకి పరిచయం చేసిన మహానగరం...

పారిశ్రామికీకరణకు, పట్టణీకరణకు ప్రామాణికం...

ఆటవిడుపులకి,ఆహ్లాదానికి,అటవీ సంపదకి,ప్రకృతి శోభకి పట్టుకొమ్మ...

విజయ చిహ్నాలకు , చరిత్ర సత్యాలకు సజీవ సాక్ష్యం...

తుఫానులను, సునామీలను గుండెలపై మోసి కూడా చెక్కుచెదరని పడిలేచిన కెరటం...

లెక్క లేనంత మంది కవులకు, కళాకారులకు, స్వాతంత్ర సమరయోధులకు ,శాస్త్రవేత్తలకు పుట్టినిల్లు...

రాష్ట్రం ఏదైనా రా రామ్మని పిలుస్తుంది, దేశం ఏదైన ధైర్యంగా ఉండమంటుంది, మంచితనానికి, మత సామరస్యానికి మచ్చుతునక...నా విశాఖ

కాలం

కన్నుల ముందే కరిగి పోతుంది కమనీయ జ్ఞాపకాలను మనకు వదిలేస్తూ...

 నిస్సహాయ స్థితిలో ఉన్న అసమర్దునికి సైతం అనితర సాధ్యం కానటువంటి విజయాలను సాధిన్చేటట్లు చేస్తుంది...

నేనే గొప్ప అనుకున్న ఎంతోమంది అహంకారులను, నియంతలను, అమాయకముగా చూస్తూ మౌనముగా సాగిపోతుంది...

మార్పులు చేర్పులు, మంచి చెడులు ఎన్ని జరుగుతున్నా సాక్షిగా ఉంటుంది కానీ వాటికి సలహాలు ఇవ్వనిది...

రాజుల విజయాలు, ప్రభుత్వ పాలనలు, సామాన్యుల కష్టాలు, సంపన్నుల విలాసాలు అన్నింటిని తన మదిలో నింపుకుంటుంది...

చరిత్ర కెక్కిన ప్రేమకధలు, చరిత్రను కించపరిచిన హీనగాధాలు, అబ్బుర పరిచే అద్భుత ఆవిష్కరణాలు మరెన్నో మదిలో దాచుకున్న మౌనం ...
 


కుబేరుడైన , కూటికి లేని వాడు అయిన తనతో సాగిపోవడమే గాని , తరలిపోయిన క్షణాన్ని కూడా మరల ఇవ్వనిది...

మానవ మేధస్సు కు అందని ఏన్నో సమస్యలకు , తన కాల గమనంలో సమాధానం చెప్పిన మౌన ముని...