Saturday, August 19, 2017

నేనెవరు





నిశీధి తిమిరాలను చీల్చుకొని తొలి ఉషోదయ కిరణాలు నేలను తాకిన ఆ క్షణాన, మెల్లగా సాగర గర్భం నుంచి వస్తున్న ఉదయభానుడిని చూస్తూ సాగర తీరాన నడుచుకుంటూ వెళ్తుంటే, ఎందుకో అనిపించింది నేను ఎవరు అని ఎప్పుడో ఎవరో చెప్పితే విన్న మాటలు... ఇప్పుడు చదువుతున్న పుస్తకం...అనుభవించిన జీవిత మధనంలో వచ్చిన ఆలోచనలు...

అవును నేనెవరు...?

అమ్మ కడుపులో అణువు అంత నుంచి కంటికి కనిపించే ఈ ఆకారం వరకు,

నిశీధి, నిర్మానుష కుహరములో నవమాసాలు అమ్మ గుండెలయ సాక్షిగా, ఉమ్మనిరుతో బ్రతికింది నేనేనా...

అణువు నుంచి ఆకాశహర్మ్యాలను తాకగలిగే ఈ అనంత శక్తి సామర్ద్యాలు నాకు ఎక్కడవి...

నేనెవరు...?

ఏదో సాధించాలని, సాధించలేక చతికిలపడేది నేనేనా...

ఒకవేళ నేను చనిపోతే ఎక్కడకు వెళ్తాను...,

ఈ ఆనంత విశ్వంలో నేను మిళితం అయిపోతానా...

అంటే పుట్టేటప్పుడు ఈ ఆనంత విశ్వంలో నుంచి ఒక అణువునై వచ్చాను,

పోయేటప్పుడు మళ్ళీ ఈ అనంతం లో కలిసిపోతాను...

అంటే ఇప్పుడు కనిపిస్తుంది నేను కాదు,

ప్రాకృతిక శక్తిల సమ్మేళనం నేను...

సూర్యచంద్రాదుల శక్తి నా సొంతం...

సాగరగర్బాల ప్రకంపనల తీవ్రతల బలం నా సొంతం...

విత్తు నుంచి మహా వృక్షం ఉద్భవానికి ఉత్తేజం నా సొంతం...

నేను అనన్య సామాన్యం...

అనితరసాధ్యం...

సకల జగత్తు సంతోషమే నా అభిమతం...

చరాచర జీవకోటి సమాన దృష్టితో చూడడం నా కర్తవ్యం... 


అవును నేనే నేనే విశ్వమానవుడను…..