Friday, August 25, 2017

నాకు ఇష్టం



సముద్రం అంటే నాకు ఇష్టం ,

ఎగసిపడే కెరటాలు ఉన్నాయని కాదు, పడిన లేచే కెరటాలు ఉన్నాయని... 



కలాం గారు అంటే నాకు ఇష్టం ,

అంతరిక్ష శాస్త్రవేత్త ఉన్నాడని కాదు అతని అంతరంగంలో నా అధ్యాపకుడు ఉన్నాడని... 



శ్రీ శ్రీ గారు అంటే నాకు ఇష్టం ,

కవిత్వం రాస్తారని కాదు , తాను అనుకున్నది నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెప్తారని... 



చెట్లు అంటే నాకు ఇష్టం ,

ఎదుగుతున్నాయని కాదు ఎదిగినా ఒదిగి ఉండమని నేర్పిస్తున్నాయని... 



కొండలు ,లోయలు అంటే నాకు ఇష్టం,

అద్భుత అందాలకు ఆటవిడుపులని కాదు, నీ అంతరంగంలో ఎత్తుపల్లాలను తెలుసుకోమని చెప్తున్నాయని... 



ఉషోదయం అంటే నాకు ఇష్టం ,

చిమ్మ చీకట్లు పారద్రోలుతుందని కాదు, ప్రతి రోజు నాలో సరికొత్త వ్యక్తిని నాకు పరిచయం చేస్తుందని ... 



వెన్నెల రాత్రులు అంటే నాకు ఇష్టం,

తారల అందచందాలను ఇనుమడింప చేస్తుందని కాదు, నాలో ప్రశాంతతను నాకు పరిచయం చేస్తుందని... 



జీవితం అంటే నాకు ఇష్టం,

ఏదోలా బ్రతికేయాలని ఆశతో కాదు, ప్రతి రోజు ఒక కొత్త పాఠం నేర్పుతుందని...

 

శ్మశానం అంటే నాకు ఇష్టం,

ఆఖరి మజిలీ అవుతుందని కాదు, సమానత్వానికి సముచిత స్థానం ఇస్తుందని...

 

అమ్మ, నాన్న, గురువు, తెలుగు అంటే నాకు ఇష్టం ,

ఏదో ఒకటి చెపుదామని కాదు, ఈ ఇష్టాలకు కారణాలు చెప్పలేనన్ని ఉన్నాయని...