Saturday, December 12, 2020

కదలని(వ్వని) కాలం




నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు కరిగే సమయం

నువ్వొస్తావని తెలిసి మొండికేస్తుందేమో ...

అందుకే అస్సలు కదల్ననే గడియారపు ముల్లుని

బతిమాలో భయపెట్టో పరిగెత్తించాలనుకుంటా...

గాలి తెమ్మెరలా ఎప్పుడూ ఏదో పాట నలిగే నా పెదవులపై

నువ్వు రాగానే మౌనం ఆవహిస్తుందెందుకనో..

నిన్ను సేదతీర్చటానికయినా ఈ సారికి 

ఆ సిరిమువ్వల గొంతు అప్పు తెచ్చుకుంటా...

నవ్వులో కూడా కంటి చెమ్మ కలిసుంటుందెందుకనో

ఈసారైనా జ్ణాపకాల గులాబీలు తడిమితే

పరిచయాల పరిమళాలతో పాటు

ఎడబాటుల ముళ్లుంటాయని గుర్తు తెచ్చుకుంటా...