Sunday, November 24, 2019
Wednesday, November 13, 2019
నేను ---- తాను
తానొక పుష్పం
నేనేమో ధవనం
మా ఇరువురి కలయిక పరిమళం
తానొక మధురం
నేనొక రుధిరము
కలిసిన కొలది పెరిగేను ప్రణయం
తానొక మేఘం
నేనేమో పవనం
కలిసిన మరు క్షణం వర్షం
తానేమో ప్రేయసి
నేనేమో ప్రియుడు
మా ప్రేమే అజరామరం
తానేమో తనువు
నేనేమో ఆయువు
కలిసిన మమైక జీవనం
తాను తానే
నేను నేనే
కానీ ఒకరిని వీడి మరొకరు మనలేము
ఊహల్లో, ఊసుల్లో
కలలో, కదలికలో
ఆలోచనల్లో, ఆచరణలో
అదే మేము
నేను ---- తాను
✍ శ్రీ ✍
Tuesday, November 12, 2019
జ్ఞాపకాల పరిమళాలు
పనిగట్టుకు కళ్లాపి జల్లి
వెళ్లిపోయే మేఘాలు...
నీ ఊసులే చెప్పుతూ ఊరిస్తూనే ఉంటాయి.
జారిపడే చుక్కల కోసం చేతులు చాచిన
కొబ్బరి చెట్లు...
రంగులెయ్యని బొమ్మలా ఊరకనే వెక్కిరిస్తాయి.
అడుగులో అడుగేసే సెకన్ల ముల్లు...
కాలం కదలదని చెపుతూనే ఉంటుంది.
కాలం కదలదని చెపుతూనే ఉంటుంది.
ఎప్పటిలా పదిలంగా ఉండేవీ...
తలచినా చాలు హఠాత్తుగా హత్తుకొని ఉక్కిరి
బిక్కిరి చేసేవీ...
నీ జ్ఞాపకాలు
నీ జ్ఞాపకాలు
Wednesday, November 6, 2019
మా బడి
గుల్మోహర్ పూల ఎర్ర తివాచీ తో
కప్పేసిన దారులెక్కడ
“తోటమాలి” కర్ర చప్పుడు కి
పరుగులేత్తే తుంటరి తనాల జాడెక్కడ
అలసిన మధ్యాహ్నాలలో ఆడిన తొక్కుడు బిళ్లాటల
గళ్ళెక్కడ
“మామ్మ బడ్డీ” లో కొనుక్కున్న నారింజ
మిఠాయిల లెక్కెక్కడ
బువ్వ పంచుకుతినే మా మామిడి చెట్ల గట్లెక్కడ
గొప్పగా లెక్కపెట్టుకున్న ఆకాశ మల్లె
పూల గుత్తుల పరిమళాలెక్కడ
దారిలో ఏరుకున్న ఈతపళ్లూ, మామిడి పిందెల రుచులెక్కడ
క్రమశిక్షణకు మారుపేరైన మా మాష్టార్ల
అదిలింపులెక్కడ
బాల్యపు తీపిగురుతులన్నీ ఒడిలో
నింపుకున్న మా“బడి” ఆనవాలెక్కడ
Subscribe to:
Posts (Atom)