ఛాదస్తపు ఛందస్సుల నుంచి
అలంకారాల ఆర్భాటం నుంచి
సరళ తెలుగుని సామాన్యుడికి అందించినా
ఇంకా తెలుగు మనకి అర్ధంకాని బ్రహ్మాండ
పదార్థమే
ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కదా!
అమ్మా అని పిలిపించు కోవాలంటే నామోషి
అమ్మా అని పిలవాలంటే అవమానం
తెలుగులో మాట్లాడాలంటే అనాగరికం
తెలుగు వినడం సంస్కార హీనం
ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కదా!
అభివృద్ధి చెందిన దేశాలు, సాధించిన విజయాలకు పునాది మాతృభాష
అని గొంతు చించుకొని అరుస్తున్నా మనకు
వినిపించదు ఆ ఘోష
పెరటు చెట్టు వైద్యానికి పనికి రాని వైనం
అదే అందంగా అలంకరించి అమెజాన్ లో
అమ్మేస్తే ఎగబడి కొనే తత్వం
ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కదా!
తెలుగుని ప్రోత్సహించడం, ప్రాంతీయ భావాలు ఎగదొయ్యడమా
ఆంగ్లాన్ని అనుసరించడం ప్రపంచీకరణమా
అమ్మనుడిలో కమ్మగా మాట్లాడడం తెలియనితనం
వచ్చీ రాని ఆంగ్లంలో మాట్లాడడం హుందాతనం
ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కదా!
పక్క రాష్ట్రాలు భాష కోసం
ప్రాణాలిస్తుంటే
మనం, పిల్లలు మాతృభాషలో మాట్లాడితే
మందలిస్తున్నాం
ఉన్నత విద్యలో సరే సరి,
ప్రాధమిక విద్యలో కూడా మాతృభాష మూలాలను
తీసేస్తున్నాం
ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కదా!
ఇకనైనా కళ్ళు తెరిచి
అమ్మనుడిని అక్కున చేర్చి
దేశ భాషలందు తెలుగు లెస్స అని
తెలుగు పునర్వైభవాన్ని తీసుకొద్దాం
నిజమైన తెలుగు బిడ్డలమని ఇప్పుడయినా
నిరూపిద్దాం
తెలుగు వారందరికీ
" తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు "