వచ్చింది అదిగో మళ్ళీ ఉగాది
స్వాగతించనా లేక మన స్వగతాన్ని తలచి శోకించనా
కొత్త బట్టల కొలతలకి దర్జీలు లేరు
చేనేత వస్త్రాల మగ్గాలు మచ్చుకైనా కానరావు
పచ్చడి మెతుకులకు దిక్కు లేని వాడికి షడ్రుచుల పచ్చడిలా
బరువెక్కేను అన్ని ధరలు బడ్జెట్ లో
సామాన్యుడి నడ్డి విరి చేను నడి రోడ్డులో
కొన్నా పన్నే , అమ్మినా పన్నే , సంపాదించినా పన్నే
పన్ను మీద పన్ను , ప్రభుత్వాలకు మనమే వెన్ను, దన్ను
పన్నయితే కట్టగలం పంటి కిందకి పట్టెడు అన్నం పంపలేము
ఇన్ని పన్నులు కట్టినా ఇంకా లోటు బడ్జెట్ లే
అభివృద్ధి అన్నమాట ఆశనిపాతాలే
కనీస నిలువలు లేవని కత్తిరిస్తారు మన సొమ్ముని
మన సొమ్ము దోచినవాడిని కనికరిస్తారు పొమ్ము పొమ్మని
మన స్వేద , రక్త మాంసాలు
పెద్దవారికి విందులయ్యే
అలా అడిగిన వాళ్ళు అభివృద్దికి ఆటంకాలయ్యే
పంచాంగం వచ్చింది పరిహసించడానికి
వ్యయమే గాని ఆదాయం ఆనవాలికి కూడా కనిపించకుండా ఉండటానికి
మనుషులమని మరిచిపోయి, యంత్రాలతో పోటి పడి సంపాదించిందంతా
పన్నులు కట్టి , చివరాఖరికి చేతి చమురు చూసుకొని ,
సంవత్సరాంభంలో పంచాంగం నిజమని గడిపేస్తాము
ఇది ఎప్పుడూ సామాన్యుడి పంచాగమే
సమస్యలకు శంఖారావమే
దోపిడీ దొరలకు వర్తించదు ఇందులో ఏ అంకం
వారిదెప్పుడూ అంకెల గారడీలో అందేవేసిన తనం
గ్రహాల గతులను నమ్మే గానుగెద్దులం
మన చేతితో , మన నడ్డే విరిచే
ప్రభుత్వాలను ఎంచుకున్న అమాయకపు గొర్రెలం
ఆవేశంలో అరిచాం, ఆకలేసింది తినేద్దాం, నిద్ర వస్తుంది పడుకుందాం
మళ్ళీ తెల్లారి లెగాలి ఉషోదయాన ఉగాదికి స్వాగతం పలకాలి కదా మరి...