ప్రియా...
నిన్ను మరిచిపోదామని
హృదయాన్ని శిలగా మార్చుకుంటే
నీ జ్ఞాపకాలు ఆ శిలని శిల్పం గా మారిస్తే
ఆ శిలా రూపం నీదే అయితే
నిన్ను మరిచేదెలా...!
నిన్ను మరిచిపోదామని
కొద్ది క్షణాలు గాడనిద్ర లోకి వెళితే
కలలోకి కథలు ఏవో వస్తే
ఆ కథల కావ్య కన్యకది నీ రూపమే అయితే
నిన్ను మరిచేదెలా...!
నిన్ను మరిచిపోదామని
విహారయాత్రకు వెళితే
దూరాన కమ్మని కోయిల గానం వినిపిస్తే
ఆ గానం నీ గాత్రాన్ని గుర్తుచేస్తే
నిన్ను మరిచేదెలా...!
నిన్ను మరిచిపోదామని
విదేశాలకు వెళ్ళితే
చిరు మందహాసంతో వనితలు ఎవరో ఎదురొస్తే
ఆ మందహాసంలో నీ మోమే కనిపిస్తే
నిన్ను మరిచేదెలా...!
నిన్ను మరిచిపోదామని
సాగర తీరానికి సేదతీరడానికి వెళితే
అలలు ఆశగా నా కాలిని తాకితే
ఆ స్పర్శ నీ స్పురణను రప్పిస్తే
నిన్ను మరిచేదెలా...!
నిన్ను మరిచిపోదామని
మౌనాన్ని ఆశ్రయింస్తే
నా ఉచ్ఛ్వాశ , నిశ్వాస గుండె లయ శబ్ధాలు వినిపిస్తే
ఆ లయలో నీ హోయలే కనిపిస్తే
నిన్ను మరిచేదెలా...!
నిన్ను మరిచిపోదామని
విఛ్చిన్న మైన మనస్సుతో , అగమ్యగోచరంగా
నడుచుకుంటూ వెళ్తున్నా
అంతలో పిడుగులు , మెరుపుల
వర్షం ఎదురైతే
ఆ మెరుపుల వెలుగులలో నీ మోమే ప్రతిబింబిస్తుంటే
నిన్ను మరిచేదెలా...!
నిన్ను మరిచిపోదామని
ఒక నిశీధి గదిలో ఒంటరిగా కూర్చున్నాను
ఆ గదిలో మౌనము
మదిలో అనంతమైన నీ ఆలోచనల పరిభ్రమణం
నిన్ను మరిచేదెలా...!