కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు , మహాపుఋషులౌతారు అని మనమందరం చదువుకున్నాం...
కానీ అది నువ్వు మాత్రమే నిరూపించావు…
నక్షత్ర మండలానికి వెలుగు కావాలని…అర్ధాంతరంగా జాతి మొత్తాన్ని అంధకారంలో నింపి వెళ్ళిపోయావు.
ఆయువే కావాలంటే ఆ దేవుడికి, నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరు నీకోసం…
కానీ నువ్వే కావాలంటూ తీసుకెళ్ళిపోయాడు..
ఎక్కడున్నావయ్యా వివేకానందా అని ఎదురు చూస్తున్న తరుణంలో
నిదురిస్తున్న నా జాతి యువతకు నీ మాటల చేతల ప్రేరణ తో
జాగృతినిచ్చావు…
పసివాడిగా ఉన్నప్పుడు పేపర్లు పంచావు..
ఆ ప్రేరణ తో ప్రపంచాన్ని జయించావు…ఆ పేపర్లకే పతాక శీర్షిక వయ్యావు…
ఏ తల్లి కన్న బిడ్డవో భరత మాత కు ముద్దు బిడ్డవయ్యావు…
కొన్ని కోట్ల మంది బిడ్డలకు స్ఫూర్తివయ్యావు.
నువ్వు కన్న కలలు మేము నెరవేర్చలేకపొతున్నామని…
మరణించి…మరుజన్మ లో ఆ కలలని సాధించి చూపిద్దామని వెళ్ళిపోయావా..
ఒక వ్యక్తి జన్మకు సార్ధకత అంటే ఇలా ఉండాలని చూపిన నీకు జోహార్లు.
ఒక రంగంలో ప్రసిద్ధి చెందడమే గగనం అయిపోతున్న ఈరోజుల్లో…
ఒక వ్యక్తి గా, మిసైల్ శక్తి గా, అభిమాన నేతగా, బాలాల పాలిట ప్రేమను పంచే తాతగా,
యువతకు స్ఫూర్థి ప్రదాతగా, దేశ విదేశాలకు దిక్సూచి గా, నిలిచావు…
రామేశ్వరం నుంచి రాష్ట్రపతిగా నీ ప్రయాణం అనితర సాధ్యం చేసి…ఆ దేవతలకు సైతం స్ఫూర్తి నిచ్చి ఉంటావు…
అందుకే స్వర్గంలో అత్యున్నత పదవినివ్వటం కోసం నిన్ను తీసుకెళ్ళిపోయారు…