Wednesday, April 9, 2008

నేను


ఎన్నో ఆశలతో పూచిన అందమైన పూబాలను కఠిన హస్తాలతొ
కర్కశంగా తుంచినా ప్రశ్నించలేని నిస్సహాయ లతను నేను...

గుండెలోతులలోని బాధను హృదయాంతరాలలోని ఆవేదనను ఆవిరయిపోతున్న ఆశలను ఆపలేని అసమర్థుడిని నేను...

ఉషోదయ వేళ తన ఒడిని వదిలి వెళ్ళిపోతున్న ఉదయభానుడిని
ఆగమని చెప్పలేని నిశ్శబ్ద సాగర గర్భమును నేను...

కమనీయ రాగాల కోయిలమ్మను అంతమొందించదలచినా
బోయవాడినీ ప్రశ్నించలేని అశక్తుడనైన ప్రకృతిని నేను...

అలసిసొలసిన బాటసారిని సేదతీర్చిన నన్ను గొడ్డలి వేటుకు బలిచేస్తున్నా,
భరించి బదులు పలుకలేని అచేతనమైన వృక్షాన్ని నేను...

ఊహలే ఊపిరిగా జ్ఞాపకాలే జీవితంగా బతుకుతున్న వాడికి
వాటిని దూరం చేస్తున్న కాలాన్ని గద్దించి అడగలేని నిర్లిప్త మౌనాన్ని నేను...

చల్లని స్పర్శతో మేలు కొలిపి తననుఒంటరిని చేసి వెళ్ళిపోతున్న
చంద్రుని ఆగమనలేని లేలేత కలువను నేను...

మదిలోని ఆవేదన ఉవ్వెత్తున లేచే కెరటాలలా పొంగుతున్నా
మనసును సైతం సమాధాన పరచలేని సగటు మనిషిని నేను...


తన అరుణ కిరణాలతో మేలు కొలిపి తనను ఒంటరిని చేసి వెళ్లి పోతున్న రవిని ఆగమన లేని లేలేత కలువను నేను...

అన్ని నా కనుల ముందు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండే ఒకనాటి విద్యార్దిని కాను నేను...

విశ్వ విజ్ఞానానికి వారసుడను, సాహితీ సంపదకు, సర్వమానవాళి మహోన్నతికి ముందడుగు నేను...

విజ్ఞానముతో మనిషి మహిమను సృష్టించి అంతరిక్షాన్ని సైతము తన ఆధీనములోనికి తెచ్చుకుంటున్న ఈ తరుణములో కూడా కులాల కుళ్ళుతో, మతాల మత్తులో ఒకరినొకరు ద్వేషించుకుంటూ పరస్పరం విభేదించుకుంటూ ఎన్నాళ్ళుఇలా మానవతా సిగ్గుతో తలవంచుకునేటట్లు ప్రవర్తిస్తారు

విజ్ఞానవంతులైన యువతీ యువకులు సైతము జ్ఞానహినులై ఆబిజాక్ష గర్వముతో ఎన్నాళ్ళుఇలా సమాజాన్ని అంధకారములో ఉంచుతారు

నేటికైనా కళ్ళు తెరిచి చేయి చేయి కలిపి నవసమాజ నిర్మాణము కోసము కలిసి నడుద్దాం అభ్యుదయ బాటలో మరొక్కసారి అధిష్టానమును అదిరోహిద్దాం...