అందరూ Happy Mother’s Day అంటుంటే…
ఎప్పుడో జరిగిన ఈ చిన్న సంఘటన
మనసులో మళ్లీ తడిమింది.
అందుకే మీతో పంచుకోవాలనిపించి ఇలా రాశాను…
అయినా ఒక సందేహం మాత్రం ఎప్పుడూ ఉంటుంది…
అమ్మకి ఒక్కరోజే ఎందుకు?
మన మొదటి ఊపిరి నుంచి
చివరి వరకు ప్రతి రోజూ అమ్మదే కదా…
పెట్టినది అమ్మే,
తిట్టినది అమ్మే,
కొట్టినది కూడా ప్రేమతోనే అమ్మే…
మన ఆనందంలో నవ్వేది అమ్మే,
మన బాధలో నిశ్శబ్దంగా కన్నీరు పెట్టేది కూడా అమ్మే…
అందుకే
అమ్మను గుర్తు చేసుకోవడానికి
ఒక్కరోజు సరిపోదు…
ప్రతి రోజు అమ్మదే…
*అమ్మ కోసం ఒక చిన్న జ్ఞాపకం*
దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం…
జామ్‌నగర్ నుంచి విశాఖపట్నం–పూరి ఎక్స్‌ప్రెస్‌లో
సెలవులకు ఇంటికి వస్తున్నాను.
అహ్మదాబాద్‌లో ఒక గుజరాతీ కుటుంబం రైలు ఎక్కింది.
మాటల్లో మాటగా తెలిసింది — వాళ్లు కూడా విశాఖపట్నమే వస్తున్నారు.
వాళ్ల అబ్బాయి పెందుర్తి దగ్గరలోని ఓ ఆశ్రమంలో చదువుతున్నాడట.
కుటుంబం మొత్తం ప్రయాణం కాబట్టి
వాళ్లు ఇంటి నుంచి వంట చేసి కూడా తెచ్చుకున్నారు.
ఆప్యాయంగా నాకూ పెట్టారు…
కానీ నేను మృదువుగా “వద్దు” అన్నాను.
“ఎందుకు?” అని అడిగితే…
“చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాను కదా…
అమ్మ నా కోసం వంట చేసి ఎదురు చూస్తూ ఉంటుంది,
అక్కడికెళ్లి తింటాను…” అన్నాను.
అంతే…
ఆ గుజరాతీ అమ్మ కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి.
“మా కొడుకు కూడా ఇలాగే ఎదురు చూస్తుంటాడేమో…” అంటూ
చాలాసేపు భావోద్వేగంతో ఏడ్చేశారు.
వెళ్లే ముందు ఒక మాట అన్నారు—
“మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు…” అని.
అప్పుడు నేను మౌనంగా విన్నాను.
కానీ ఇప్పుడు అనిపిస్తుంది…
అదృష్టవంతురాలు అమ్మ కాదు,
ఆ అమ్మకు కొడుకుగా పుట్టిన నేనే అదృష్టవంతుడిని అని.
చెప్పడం మరిచిపోయాను…
ఇప్పటికీ సెలవుల్లో ఇంటికి వెళ్తే,
అమ్మ చేతి వంట తినకుండా తిరిగి రాను…
✍️శ్రీ ✍️