Showing posts with label రాతలు. Show all posts
Showing posts with label రాతలు. Show all posts

Saturday, December 12, 2020

కదలని(వ్వని) కాలం




నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు కరిగే సమయం

నువ్వొస్తావని తెలిసి మొండికేస్తుందేమో ...

అందుకే అస్సలు కదల్ననే గడియారపు ముల్లుని

బతిమాలో భయపెట్టో పరిగెత్తించాలనుకుంటా...

గాలి తెమ్మెరలా ఎప్పుడూ ఏదో పాట నలిగే నా పెదవులపై

నువ్వు రాగానే మౌనం ఆవహిస్తుందెందుకనో..

నిన్ను సేదతీర్చటానికయినా ఈ సారికి 

ఆ సిరిమువ్వల గొంతు అప్పు తెచ్చుకుంటా...

నవ్వులో కూడా కంటి చెమ్మ కలిసుంటుందెందుకనో

ఈసారైనా జ్ణాపకాల గులాబీలు తడిమితే

పరిచయాల పరిమళాలతో పాటు

ఎడబాటుల ముళ్లుంటాయని గుర్తు తెచ్చుకుంటా...


Wednesday, June 10, 2020

మరో పీడ కలా ???


అంగుళమున్న మిడతల్లారా ఆరడుగుల మనిషిని వణికిస్తున్నారా

ఒక్క పూట వదిలితేనే టన్ను పంట తింటారంటా

ఎడారిలో ఉంటారంటా, వర్షానికి పెరుగుతారట

 

అకాల వర్షాన్ని, ఎదురు చూడని మాంద్యాన్నీ తట్టుకుని

రక్తాన్నే చెమటగా మార్చి పంట పండించే

అన్నదాతనూ పగబట్టి పంటను స్వాహా చేస్తారా

 

ప్రకృతి కోపానికే అల్లాడుతున్న పచ్చని చేలల్లో

రాకాసి మూకలై దాడికి దిగుతారా

మనుషులందరికీ ముచ్చెమటలు పట్టిస్తారా

 

మహమ్మారి ఉగ్రరూపానికి కకావికలమైన దేశానికి 

మూలిగే నక్క మీద తాటిపండల్లే దెబ్బ కొడతారా

చరిత్రలో మరో పీడకలగా మారుతారా


Monday, May 18, 2020

వలస జీవి బతుకు చిత్రం

వలస జీవి బతుకు చిత్రం

 


కన్నీరింకి పోయిన కళ్ళతో వేల మైళ్ళ ప్రయాణం

ఆకలితో పొట్ట చేత పట్టుకు ఆగని సాహసం  

ఎండకు మాడుతూ నడిచే పసి మొగ్గలు

అలసి సొలసి సొమ్మసిల్లిపోయే నిండు చూలాలు   

వేల మైళ్ళ పయనం చూసే కంటికే నొప్పొచ్చేలా వారి దైన్యం  

 

పొట్టకూటికి సొంతూరొదిలి వచ్చినందుకు

మహమ్మారి పుణ్యమాని మెతుకు దొరకని వైనం

కన్న ఊరెళ్లే దారిలేక, ఆకలితో అలమటించలేక

నెత్తిమీద మూటతో చంకలో పిల్లలతో

వేల మైళ్ళ పయనం చూసే కంటికే నొప్పొచ్చేలా వారి దైన్యం  

 

ఎండనకా, వాననకా ఆగని కాలి చక్రం

దాతలిచ్చే పట్టెడన్నం కోసం ఆగని పడిగాపులు

కన్నపేగు ఆకలి తీర్చి, నీటితో కడుపునింపుకుంటూ

ఎడతెగని ప్రయాణం, ఎప్పటికీ చేరేనో గమ్యం

వేల మైళ్ళ పయనం చూసే కంటికే నొప్పొచ్చేలా వారి దైన్యం  


Saturday, February 29, 2020

తలపు


తలపు


అలిసి సొలసి ఒత్తిగిల్లిన రోజు  లీలగా నీ ఊసు గుర్తొస్తుంది
అయినా మగత తీరక, మాట వినని తలపునాపలేనేమో

తనవి కావంటూనే కలల్ని పదిలంగా దాచుకుంటుంది
తడారిన కళ్ళకి ఎప్పుడో రాసిచ్చిన వీలునామా ఏమో

చెంపలపై ఆవిరైన కన్నీటి చారికల ఉనికి తెలుస్తుంది
తెలియకుండా ఎర్రటి సిగ్గును కప్పేస్తున్నాయో ఏమో  

తెలియని తలపు దారిలో మనసేదో వెతుకుతుంది 
కాసేపాగండని చెప్పే చనువు లేదో ఏమో

ఉక్కిరి బిక్కిరి చేసిన ఊహలనుండి మనసు ఉలిక్కిపడింది

నిద్దట్లో మెలకువలా నువ్వొచ్చెళ్ళావో ఏమో


PC Source:Google

Sunday, November 24, 2019

నాకోసం...


రెప్పల తలుపులు మూసుకున్నాయి
ఏదో కొత్తలోకపు ప్రయాణం
నల్లరంగు రగ్గు కప్పుకున్న
  ప్రపంచం...
నిప్పుల లోయలు...హాహాకారాలు
మచ్చుకైనా లేని జీవం
చిమ్మ చీకట్లను తోసేస్తూ గబ గబా దారులన్నీ దాటేస్తున్నా...
మెత్తగా చేతికి తాకిన నీ స్పర్శ...
కలలో కూడా నువ్వున్నావనే భరోసా...


Tuesday, November 12, 2019

జ్ఞాపకాల పరిమళాలు



పనిగట్టుకు కళ్లాపి జల్లి వెళ్లిపోయే మేఘాలు...
నీ ఊసులే చెప్పుతూ ఊరిస్తూనే ఉంటాయి.
జారిపడే చుక్కల కోసం చేతులు చాచిన కొబ్బరి చెట్లు...
రంగులెయ్యని బొమ్మలా ఊరకనే వెక్కిరిస్తాయి.
అడుగులో అడుగేసే సెకన్ల ముల్లు...
కాలం కదలదని చెపుతూనే ఉంటుంది.
ఎప్పటిలా పదిలంగా ఉండేవీ...

తలచినా చాలు హఠాత్తుగా హత్తుకొని ఉక్కిరి బిక్కిరి చేసేవీ... 
నీ జ్ఞాపకాలు

Wednesday, November 6, 2019

మా బడి





గుల్మోహర్ పూల ఎర్ర తివాచీ తో కప్పేసిన దారులెక్కడ
“తోటమాలి” కర్ర చప్పుడు కి పరుగులేత్తే తుంటరి తనాల జాడెక్కడ

అలసిన మధ్యాహ్నాలలో ఆడిన తొక్కుడు బిళ్లాటల గళ్ళెక్కడ
“మామ్మ బడ్డీ” లో కొనుక్కున్న నారింజ మిఠాయిల లెక్కెక్కడ

బువ్వ పంచుకుతినే మా మామిడి చెట్ల గట్లెక్కడ
గొప్పగా లెక్కపెట్టుకున్న ఆకాశ మల్లె పూల గుత్తుల పరిమళాలెక్కడ

దారిలో ఏరుకున్న ఈతపళ్లూ, మామిడి పిందెల రుచులెక్కడ
క్రమశిక్షణకు మారుపేరైన మా మాష్టార్ల అదిలింపులెక్కడ

బాల్యపు తీపిగురుతులన్నీ ఒడిలో నింపుకున్న మా“బడి” ఆనవాలెక్కడ

Wednesday, October 30, 2019

మనసా...




మగత తీరని రెప్పలను తోసుకుంటూ వచ్చే ఉదయాన్ని పొమ్మంటున్నా...
రాత్రి నీ ఆలోచనలో అలిసిపోయిన మనసు సేదతీరాలని..

తీరికలేని మధ్యాహ్నంలో నీ తలపును పక్కకు తోసేస్తున్నా
నీ స్పృహ తో కొట్టుమిట్టాడే గుండె వేగాన్ని తగ్గించాలని

జ్ఞాపకాలు మిణుగురులై చుట్టుముట్టే సాయంత్రపు ఏకాంతంలో
తెలియకుండా ఎదురు చూస్తూనే ఉన్నా

వచ్చే నిశిరాత్రి ఊరికే రాదు...
నువ్వుంటే బాగుణ్ణనే ఆలోచన తెస్తుంది...
అయినా

వానలో వెన్నెల కోసం వెతుకుతున్నానా...
అత్యాశేమో...