Wednesday, December 4, 2019

నవ భారతము




భగవంతునికి భక్తులం
ఏదో ఒక మతానికి ఆప్తులం


చదువుకున్న విజ్ఞానులం
మాయలు, మంత్రాలు నమ్మే మూర్ఖులం


అభివృద్ధి కోసం మాట్లాడుకుంటాం
అమలు చెయ్యాలంటే కొట్టుకుచస్తాం


అన్ని తెలిసిన మేధావులం
 ఏమి చెయ్యని దద్దమ్మలం


తల్లిదండ్రులను ప్రేమించే దేశమంటాం
వృద్దాశ్రమాలు వృద్ది చేస్తాం


కుటుంబ విలువలు కోసం మాట్లాడతాం
ఒక్కటిగా ఉండటానికి ఇష్టపడనేపడం


మన సంస్కృతీ, సంప్రదాయాలను తెగ పోగిడేస్తాం
పాశ్చాత్య  పోకడలకు బానిసలైపోతాం


ఎదురుగా ఉంటే మాట్లాడుకోం
అంతర్జాలములో ఆప్యాయత ఒలకబోస్తాం


విలువలు కోసం అనర్గళంగా మాట్లాడేస్తాం
ఆ విలువలకి వలువలు విప్పి యధేచ్ఛగా తిరిగేస్తాం


ఎదుటి వాడికి నీతులు చెప్పేస్తాం
మనము పాటించవలసి వస్తే లోకజ్ఞానం బోధిస్తాం


పల్లెటూర్లను ప్రేమిస్తాం
ఒకసారి పట్నం వస్తే మళ్ళీ వెనుదిరిగి చూడం

 
బలవంతులమని బాహాటంగా ప్రకటించుకుంటాం
కులం, మతం,ప్రాంతం ఏదో ఒక అండ లేకుండా బ్రతకలేని బలహీనులం


రూల్స్ మనమే సృష్టిస్తాం
అంతకుముందే వాటిని పాటించకపోవడానికి దారులు వెతికేస్తాం


ఓటు వేసినప్పుడు సారాయి, నోటుకి అమ్ముడుపోతాం
గెలిచినవాడు పాలన చూసి తిట్టుకుంటూ బ్రతికేస్తాం


నవ భారత నిర్మాతలం అని చెప్పుకుంటాం
ఆ నిర్మాణాలలోనే అవినీతికి పాల్పడతాం


వివేకానంద , అబ్దుల్ కలాం ను అభిమానిస్తాం
వారి మార్గంలో నడవడమే అసాధ్యం  అంటాం


దేవతలను పూజిస్తాము
ఆడవాళ్ళను అవమానిస్తాము


ప్రపంచ దేశాలకు జ్ఞానం నేర్పింది మనమే అంటాం
వారి దేశాల్లో పనిచెయ్యడానికి వరుసలో ముందుగా నిలబడిపోతాం


ఇదే మన అర్ధం కాని సగటు భారతీయుని మనస్తత్వం
 ఇదే నేటి నవ భారతనికి వారసత్వం

స్వాతంత్రం



కొన్ని వందల ప్రాణాల త్యాగఫలం , కొన్ని లక్షల  మంది కష్టాల అనుభవం నుంచి వచ్చిన సుమఫలం

వాదనలు ఎన్ని ఉన్నా వేదనలు మాత్రం పడ్డాం

అతివాదులయినా మితవాదులయినా పోరాట గమ్యం ఒక్కటే

సాధించాం అందరి సాకారం తో స్వాతంత్రం

ఇదేనా నాటి వారు కలలు కన్న స్వాతంత్రం , కోరుకున్న స్వరాజ్యం

ఒకడిని ఒకడు దోచుకోవడం , తిండి పెట్టే వాడే తిండి లేక చచ్చిపోవడం (రైతులు , 
 వృద్ధులయిన తల్లిదండ్రులు), అధికారం ఉన్న వాడే అడ్డగోలుగా వ్యవహరించడం , ఇది కాదు కదా ఆ మహనీయుల త్యాగాలకు ప్రతిఫలం

ఎక్కడ చూసినా అవినీతి, అక్రమము,స్వార్థం ,రాక్షస రాజ్యం , అహం ,అధికార దాహం, అరాచకం.
ఇది కాదు కదా వాళ్ళు కోరుకున్న స్వరాజ్యం

సొంత లాభం కొంత మరిచి , పాటుపడవోయి పక్కవాడి కోసం అన్నది మరిచి మన తరతరాల కోసం ఎదుట వారి ఆయువు సైతం ఆశగా దోచేస్తున్నారు

కాదు స్వాతంత్రం అంటే ఒక్కడే ఎదగడం , నలుగురు నవ్వుతూ ఏ కష్టం లేకుండా బ్రతకడం

మీ ఆశలకు అంతులేదా , మీ తరతరాల దోపిడీకి ఇంకా ముగింపే ఉండదా

ఇది కాదురా నిజమైన స్వాతంత్రం

ఉదయం లెగిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకు ఏది అసౌకర్యం అనిపిస్తుందో అది ఎదుటి వారికి మనము చెయ్యకుండా ఉంటే ఈ సమాజం శాంతి , సౌభ్రాతృత్వలతో నిండి పోతుంది

ఇదే ఇదే నిజమైన స్వాతంత్రం

మహనీయులు కలలు కన్న మహోన్నత స్వరాజ్యం

భావితరాలకు మనం అందించే అతి పెద్ద బహుమానం

మీటింగ్ ...


ఒకప్పుడు అక్కడ నాకొక స్థానం కావాలని కోరిక

మరి ఇప్పుడు ఎందుకా ఆ అవకాశం వచ్చిందనే చిరాకు

యదార్థ స్థితి ని అర్థం చేసుకొని పెద్ద తలకాయాల మేధోమధనం

అన్నీ తెలిసినా చెప్పలేని,
మధ్య స్థాయి ఉద్యోగుల అధికార లేమి

అది కాదని నిజం చెప్పితే అదే అందరి ముందు వారి అహానికి ఆలంబనం

తెలిసిన వాడు చెప్పిన తేదీలు రుచించవు , వాళ్ళు చెప్పిన తేదీలు పేపర్లు పైనే కానీ ప్రాక్టికల్ గా పనిచేయవు

అందుబాటు లో లేని సామాన్లు , అయినా వెనుకకు తగ్గని టార్గెట్లు

గంటల తరబడి చర్చలు , జరుగుతున్న పనులు మరింత జాప్యం 

ఇక్కడేం జరుగుతుందో అర్థం కాని వాళ్ళు కొందరు , అర్థం అయినా నోరు మెదపలేని వారు మరికొందరు

ఇక్కడంతా గందర గోళం , ఆఖరికి ఏమి నిర్ణయమో తెలియని అయోమయం

ఇదే 80% మీటింగుల సారాంశం , ప్రాజెక్టుల జాప్యానికి అసలు సిసలైన నిదర్శనం

Sunday, November 24, 2019

నాకోసం...


రెప్పల తలుపులు మూసుకున్నాయి
ఏదో కొత్తలోకపు ప్రయాణం
నల్లరంగు రగ్గు కప్పుకున్న
  ప్రపంచం...
నిప్పుల లోయలు...హాహాకారాలు
మచ్చుకైనా లేని జీవం
చిమ్మ చీకట్లను తోసేస్తూ గబ గబా దారులన్నీ దాటేస్తున్నా...
మెత్తగా చేతికి తాకిన నీ స్పర్శ...
కలలో కూడా నువ్వున్నావనే భరోసా...


Wednesday, November 13, 2019

నేను ---- తాను


తానొక పుష్పం 
నేనేమో ధవనం
మా ఇరువురి కలయిక పరిమళం

తానొక మధురం
నేనొక రుధిరము
కలిసిన కొలది పెరిగేను ప్రణయం

తానొక మేఘం 
నేనేమో పవనం
కలిసిన మరు క్షణం వర్షం

తానేమో ప్రేయసి
నేనేమో ప్రియుడు
మా ప్రేమే అజరామరం

తానేమో తనువు
నేనేమో ఆయువు
కలిసిన మమైక జీవనం

తాను తానే 
నేను నేనే
కానీ ఒకరిని వీడి మరొకరు మనలేము

ఊహల్లో, ఊసుల్లో
కలలో, కదలికలో
ఆలోచనల్లో, ఆచరణలో
అదే మేము 

నేను ---- తాను

✍ శ్రీ ✍

Tuesday, November 12, 2019

జ్ఞాపకాల పరిమళాలు



పనిగట్టుకు కళ్లాపి జల్లి వెళ్లిపోయే మేఘాలు...
నీ ఊసులే చెప్పుతూ ఊరిస్తూనే ఉంటాయి.
జారిపడే చుక్కల కోసం చేతులు చాచిన కొబ్బరి చెట్లు...
రంగులెయ్యని బొమ్మలా ఊరకనే వెక్కిరిస్తాయి.
అడుగులో అడుగేసే సెకన్ల ముల్లు...
కాలం కదలదని చెపుతూనే ఉంటుంది.
ఎప్పటిలా పదిలంగా ఉండేవీ...

తలచినా చాలు హఠాత్తుగా హత్తుకొని ఉక్కిరి బిక్కిరి చేసేవీ... 
నీ జ్ఞాపకాలు

Wednesday, November 6, 2019

మా బడి





గుల్మోహర్ పూల ఎర్ర తివాచీ తో కప్పేసిన దారులెక్కడ
“తోటమాలి” కర్ర చప్పుడు కి పరుగులేత్తే తుంటరి తనాల జాడెక్కడ

అలసిన మధ్యాహ్నాలలో ఆడిన తొక్కుడు బిళ్లాటల గళ్ళెక్కడ
“మామ్మ బడ్డీ” లో కొనుక్కున్న నారింజ మిఠాయిల లెక్కెక్కడ

బువ్వ పంచుకుతినే మా మామిడి చెట్ల గట్లెక్కడ
గొప్పగా లెక్కపెట్టుకున్న ఆకాశ మల్లె పూల గుత్తుల పరిమళాలెక్కడ

దారిలో ఏరుకున్న ఈతపళ్లూ, మామిడి పిందెల రుచులెక్కడ
క్రమశిక్షణకు మారుపేరైన మా మాష్టార్ల అదిలింపులెక్కడ

బాల్యపు తీపిగురుతులన్నీ ఒడిలో నింపుకున్న మా“బడి” ఆనవాలెక్కడ

Wednesday, October 30, 2019

మనసా...




మగత తీరని రెప్పలను తోసుకుంటూ వచ్చే ఉదయాన్ని పొమ్మంటున్నా...
రాత్రి నీ ఆలోచనలో అలిసిపోయిన మనసు సేదతీరాలని..

తీరికలేని మధ్యాహ్నంలో నీ తలపును పక్కకు తోసేస్తున్నా
నీ స్పృహ తో కొట్టుమిట్టాడే గుండె వేగాన్ని తగ్గించాలని

జ్ఞాపకాలు మిణుగురులై చుట్టుముట్టే సాయంత్రపు ఏకాంతంలో
తెలియకుండా ఎదురు చూస్తూనే ఉన్నా

వచ్చే నిశిరాత్రి ఊరికే రాదు...
నువ్వుంటే బాగుణ్ణనే ఆలోచన తెస్తుంది...
అయినా

వానలో వెన్నెల కోసం వెతుకుతున్నానా...
అత్యాశేమో...

Wednesday, May 29, 2019

రామగుండం


సార్థక నామధేయలు అని మనుషుల్లో ఉండటం విన్నాను, కానీ...

ఒక ఊరు, పేరును ఇంతలా నిజం చేస్తుందని ప్రత్యక్షంగా చూస్తున్నాను నేడు

అర్ధరాత్రి పవర్ కట్ అని లెగిసి , శౌచలయం లో కుళాయి విప్పితే,

వేడికి మరిగి ఉబికి వస్తున్న మరుగు నీటిని చూసాను

అప్పటి వరకు నాతో మాట్లాడిన సహచరుడు ఒకడు అంతలోనే ఎరుపెక్కిన కళ్ళతో,

చెమటలు పట్టిన ఒళ్లుతో, వాంతులు చేసుకుంటూ నేలకొరిగి పోయాడు

ఒక వైపు భానుడి ఉష్టతాపం, మరో వైపు భూమాత గర్భ కోతకు ప్రతీకారం

వెలసి వేపుకు తింటుంది ఇక్కడ జనాలని ఈ మాసం

నీటి చుక్కలు నేలకు తగలగానే, కాలి ఉన్న పెనం సైతం చిన్న బోతుంది

రేయి పగలు తేడాలేదు, నీళ్ళు నివురుగప్పిన నిప్పులగా మండుతున్నాయి

ఇది వేసవి తపమా, ఉదయభానుడి ఉగ్ర రూపమా,

మనకు మనమే చేజేతులా చేసుకున్న తప్పిదాలకు ప్రతిఫలమా

ఈ ఉష్టాన్ని తగ్గించాలంటే ఉద్యాన వనాలు నిర్మించాలి కానీ,

పారిశ్రామీకరణ పేరుతో మరింత అగ్నికి ఆజ్యం పోస్తే ఎలా

✍ శ్రీ ✍

Sunday, May 12, 2019

అమ్మ ...



అమ్మ ...

అణువు నుంచి కణమై , 

కణం నుంచి కాయమై ,

నీ తనువుకు గాయాలు చేసుకుంటూ ,

నీ కలలకు జీవం పోస్తూ

నీ గుండె సవ్వడి వింటూ

నవమాసాలు నీతో పాటుగా ఉన్న వాడిని

నా గుండె సవ్వడి ఆగిపోయే వరకు 

నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను

" Wish you a happy mother's day "


ప్రేమతో నీ ముద్దుల కొడుకు

Friday, May 10, 2019

స్వేచ్ఛ


ఎక్కడ లేదు స్వేచ్ఛ... ఈ స్వతంత్ర భారతంలో 

చెప్పిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడిగితే,
అడిగిన వారిని దేశ ద్రోహులని ప్రకటించగలిగే స్వేచ్ఛ...

యుద్దమంటే  గెలిచినా, ఓడినా నష్టం అని తెలిసినా,
యధేచ్ఛగా రాజకీయ లబ్దికోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే స్వేచ్ఛ

80 రోజుల్లో నోట్లు రద్దు వల్ల మంచి ఫలితాలు రాకపోతే ఎక్కడైనా నన్ను ఏమైనా చేసుకోండి అన్న పెద్ద మనిషి ఫలితాలు సంగతి అటున్చి 80 మంది పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయి నా, వైఫల్యాలకు సమాధానం చెప్పని స్వేచ్ఛ...

ఒక పార్టీలో గెలిచి , అదే పదవులతో వేరే పార్టీల్లో కొనసాగుతున్నా
చూపుడు వేలు తో ఓటు వేసిన ఓటరు నోరు విప్పి అడగలేని స్వేచ్ఛ...

ఆ పార్టీకి ఓటు వెయ్యక పోతే వాళ్ళు భారతీయులు కాదు, ఆ మతానికి చెందిన వారే కాదు అని ప్రసార మాధ్యమాలలో నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నా పెదవివిప్పి అడగని స్వేచ్ఛ... 

అధికారం చేతిలో పెట్టుకొని, అడ్డగోలుగా వ్యవహరిస్తూ, వాళ్ళ అడుగులకు మడుగులొత్తే వారికి అనుకూలంగా ప్రవర్తించినా వేలెత్తి చూపని స్వేచ్ఛ...

ప్రతిపక్షమే లేకుండా పాలన సాగించాలని ప్రయత్నిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు,
ఎందుకిలా అని అడిగితే అభివృద్ది గురించి నీకేం తెలుసని అడిగే స్వేచ్ఛ...

ఎప్పుడో పారిశ్రామికీకరణ పేరుతో యంత్రాలను తెస్తే ప్రపంచ మేధావులు ఎదురు తిరిగారు,
కానీ ఇప్పుడు మనుషులనే యంత్రాలుగా మార్చి రోజుకు 14 గంటలు, ఆదివారం అర్థ దినాలతో పని చేస్తున్నా నోరు మెదపని స్వేచ్ఛ...

ఇంత స్వేచ్ఛ నా దేశంలోకాక ఇంకెక్కడ దొరుకుతుంది, 
ఈ స్వేచ్ఛ కేవలం దొరికేది కొందరికే... పాలకులకు, పెత్తందారులకు

అయినా ఇంకా స్వేచ్ఛ కావాలంటారా, ఎవరికి???
జీవించడం మానేసి, బ్రతికేస్తున్న ఈ జీవచ్చవాలకా ,
ప్రతి రోజూ మరణిస్తూ బ్రతుకులీడుస్తున్న బడుగు జీవులకా


ఎవరికుంది స్వేఛ్ఛ???
సమాదుల్లో పూడ్చిన దేహాలకు
చితి మంటల్లో కాలుతున్న అవయవాలకు
శీతాకాలం లో కూడా కారుతున్న వెచ్చటి కన్నీరుకు
ఆకలి అని పదే పదే గుర్తు చేస్తున్న ప్రేగులకు

Tuesday, April 16, 2019

కలికాలం


గాలి ఇవ్వని చెట్లను చూసా...

ప్రేయసిని చంపే ప్రేమికుడిని చూసా...

నమ్మిన వాళ్ళే చేసే వంచన చూసా...

వసుదేక కుటుంబం అనుకున్న వాడిని అందరూ ఒంటరిగా వదిలెయ్యడం చూసా...

కన్న తల్లి నీ కర్కశంగా కాలి తో తన్నడం చూసా...

అబద్ధాలను నిజాలని , నిజం మాట్లాడే వాడిని పిచ్చి వాడు అనడం చూసా...

ఎదుగుతున్న మొక్కలను కత్తిరించి కత్తిరించి " బోన్సాయ్"  మొక్కలు గా చేసి నట్టింటిలో పెట్టుకుంటే మనుషులు ఎంతో మీ మేధావులు అని చూసా...

మనిషి కూడా అన్ని విధాలా కుచించుకు పోతుంటే చూస్తూనే ఉండి పోవడం చూసా ...

అవును ఎందుకంటే అంటే ఇది కలికాలం కదా...

Thursday, March 7, 2019

రైలు ప్రయాణం


ఒకనాడు రైలు ప్రయాణం అంటే ఎంతో సరదా 

కొత్త స్నేహాలు, కిటికీ పక్కన కూర్చుని చూస్తుంటే పరిగెత్తి పారిపోయే ప్రకృతి అందాలు

రాజమండ్రి దాటగానే గోదావరి లో రూపాయి బిళ్ల లు వెయ్యాలనే పోటీ

నెల రోజులు కష్టపడి చేసిన చెక్క పుల్లల పడవను పారుతున్న నదిలో వెయ్యాలని ఏదో ఆశ

ఎక్కిన స్టేషన్ నుంచి దిగే స్టేషన్ లోపు వరసలు కలుపుకునేటంత కొత్త పరిచయాలు 

మనం వండుకున్న వంటకాలు వేరొకరికి ఇచ్చి, వారివి మనం పంచుకొని సరదా కబుర్లు, కథలు చెప్పుకొని ప్రయాణించిన రోజులు

కానీ ఈ రోజు నేను చూసిన చేసిన ప్రయాణం...
పెళ్లయిన నవదంపతులు మాట మంతి లేకుండా చెవిలో ఇయర్ ఫోన్ లు పెట్టుకొని సినిమాలు చూస్తూ...

మధ్య మధ్య లో whatsapp లో ఎవరో స్నేహతులతో చాట్ చేసుకుంటూ... 

పరిచయం లేని పరాయి వ్యక్తులలాగ ఆ ప్రయాణం ఏమిటో...

బోగీలో ప్రతి వారి చెవులకు, పుట్టుకతోనే వచ్చాయా అన్నట్లు ఇయర్ ఫోన్ లు...

తమలో తామే నవ్వు కుంటూ
ఎదుటి వారు ఏమనుకుంటారోనన్న కనీస స్పృహ లేని తనం...

ఈ స్మార్ట్ ఫోన్లు వల్ల నిమిషాలలో బెర్త్ కన్ఫర్మేషన్ తెలుస్తోంది కానీ...

గంటలు గంటలు ప్రయాణం చేసిన కనీసం ఒకరి పేరు ఒకరికి తెలియక పోవడం...

ఒకనాటి రైలు ప్రయాణం అనుభూతులు , గుర్తుకు తెచ్చుకొని ఆనందపడాలో లేక నేటి ప్రయాణాలు తలుచుకొని బాధ పడాలో తెలియడం లేదు.


Saturday, March 2, 2019

యుద్ధం



రాజ్య కాంక్షకు, అసమర్థ పాలన కు పుట్టిన అక్రమ సంతానం యుద్దం.

అభివృద్ధికి వెన్నుపోటు  , అవకాశవాదానికి ఆయువుపట్టు యుద్ధం.

తరతరాల చరిత్రలకు తిరోగమన తిలకం యుద్దం

రాజకీయ కుయుక్తులకు , ఎత్తులపై ఎత్తులకు పరాకాష్ట యుద్ధం

ఎన్నో అందమైన జీవితాల సుమధుర స్వప్నాలను కాలరాసే రక్కసి యుద్ధం

స్వార్థ స్వప్రయోజనాలే కానీ సామరస్యం సాధించలేని సంకుచితతత్వం యుద్ధం

గెలుపుపెవరిదయినా  ప్రజల పక్షానే నష్టం అనడానికి నిలువెత్తు సాక్ష్యం యుద్ధం

యుద్ధం అంటే కాదు పక్క వాడి మీద పడిపోవడం..
నీలో అంతర్మధనాన్ని జయించి ఒక మనిషిగా ఎదగడం...

✍ శ్రీ ✍

Tuesday, January 8, 2019

కళంకిత...




సమాజంలో కళంకితులై
కోరుకున్న వాడి కళ్లలో కావ్య కన్యకలై


చీకటి పువ్వులై
చిదిమిన మల్లెలై


క్షణిక సుఖాన్ని ఎదుటవారికిచ్చి
తన కుటుంబాపు ఆ రోజు కడుపు కష్టం తీర్చి


తన ఇష్టాఆయిష్టాలను పక్కన పెట్టి
కొరివచ్చిన వారిని సుఖ పెట్టి


కోరికలను, కన్నీరును మూటకట్టి
జరుగుతున్న ఆక్రమణను మునిపంటి కింద బిగబట్టి


తనదైన తనువు పై వేరొకరెవరో చిద్విలాసముగా స్వేరవిహారము చేస్తుంటే
మనసు మధన పడుతున్న, మోములో చిరునవ్వు చెదర నివ్వక ,తనువును సాంతం అర్పిస్తుంటే


నాగరిక సమాజంలో నాటుకున్న ఆనాగరికతకు గుర్తులై
పెద్దముదారుల విలాసాలకు ప్రత్యేక సాక్షాలై


నిర్దాక్షిణ్యంగా ,  నిర్దయగా విది వాంఛితలై
సమాజ దృష్టి లో విలువలేని వేలయలులై


తగిలిన గాయాలకు మందు మరొక కొత్త గాయం అవుతుంటే
ప్రపంచ పైశాచికము మొత్తం తనపై ఆ పడక గదిలో చూపిస్తుంటే


విధులలో ,విద్యుత్ దీపాల వెలుగులలో , విలాస నక్షత్రవిడుదులులో
రెక్కతెగిన విహంగలై , చిదిగిపోతున్న పూసిన పువ్వులై


తరతరాల చరిత్రలకు చెరగని కుసంస్కార మచ్చలై
మానవజాతి పురోగతిని దిశను ప్రశ్నించే వేగుచుక్కలై


ఎన్నాళ్లు, ఇంకెన్నేళ్ళు ఈ అరాచకం , ఈ అన్యాయం
వినిపించడం లేదా ఆక్రందపు ఆర్తనాదాలు
కనిపించడం లేదా కళ్ళ ముందు కాలిపోతున్న కార్చిచ్చులు