Friday, June 29, 2018

నీ మౌనం...



ఎప్పుడో ఒకప్పుడు నా మనసు బాగోదు

అగాధల లోతుల నుండి , శిఖరాల అంచుల నుండి నిన్ను పిలుస్తున్నట్లు ఉంటుంది

అప్పుడు నువ్వు పలక పోతే , నా మాటలకు బదులు ఇవ్వకపోతే 

నేను మరింత ఒంటరిని అయిపోతాను 

మనల్ని ఇద్దరిగా సృష్టించి , ఒకటిగా చేసి , నన్ను మాత్రం ఒంటరిని చేసేశాడు అని 
ఆ కనిపించని శక్తిని ఏదో అనాలని పిస్తుంది 

అంతలోనే అనిపిస్తుంది
ఈ విరహం లేక పోతే నిన్ను చూస్తూ ఉండి పోవడమే తెలిసిన నాకు, మాటలు వచ్చు అని మరిచిపోతాను అని


Friday, May 11, 2018

ఓ మనసా...




ఎందుకే మనసా నీకు మనిషంటేే అంత అలుసు

మౌనంగా ఉన్న వాడి మదిలో ఆశలేవో రేపుతావు

ఆ ఊహల్లో ఉత్సాహంగా ఉన్నవాడి ఆశలు మీద నీళ్లు జల్లుతావు

ఏదో కష్టం అని కుమిలిపోతుంటే

ఆ కష్టంతో నీ గుండె ధైర్యం పెంచాను అంటావు

అదే రాబోయే నీ విజయానికి తొలిమెట్టు అంటావు

ఏదో శోధించి , సాధించిన తరువాత నిలకడ గా ఉండనివ్వవు

ఇంకేదో కావాలంటావు , నీ ఆటలకు హద్దు లేదా మనసా

ఏమీ లేని నాడు ఉన్న ఆనందం లో అణువంతయినా, అన్నీ ఉన్ననాడు ఉండనివ్వవు

ఎక్కడికి ఈ గమనం ,ఏమి సాధించాలని ఈ పయనం

కాలమంతా అయిన తరువాత వెనుదిరిగి చూస్తే మరిచిపోయిన బాల్యం , వడలి(వదిలి)పోయిన యవ్వనం ,

ఇదేనా జీవితం , ఎందుకే మనసా మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవా 

మనిషంటే నీకు అంత అలుసా...


Tuesday, May 1, 2018

మేడే


కత్తికి , సుత్తికి తమ చేవ తెలిసిన రోజు


భూస్వాముల గుండెల్లో డైనమైట్ లు పేలిన రోజు


కార్మికులే భానుని అరుణకిరణాలై పెట్టుబడిదారులకు తగిలిన రోజు


తాజ్ మహల్ అందాలే కాదు దానిని కట్టిన కూలీలను తలుచుకోవాలని తెలిపిన రోజు


వాడు కడితేనే సౌధం , వాడు పేరిస్తేనే ప్రాకారం అని ప్రపంచం గుర్తించిన రోజు


అణచబడుతున్న కర్షక, కార్మిక సోదరులు ఎదురు తిరిగి విజయం సాధించిన రోజు


సమస్యలకు శంఖారావం పూరించి , ఉద్యమాలకు ఊపిరిపోసిన రోజు


చీకాగో మేడే స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన రోజు


ఇది కాదు ఒక సెలవు దినం , కష్టించే ప్రతివాడి చెమటసుమగంధమై పరిమళించే పర్వదినం


ప్రగతికి పట్టుకొమ్మలైన ,పీడిత , బాధిత బాధలు నుంచి బయటపడటానికి సోదరులు అందరూ కలిసి పిడికిలిబిగించివిజయకైతనం ఎగురవేసిన రోజు


ఇది కాదు కేవలం ఒక "రోజు" ,

శ్రమకు సముచిత స్థానం సాధించి పెట్టిన ఎందరో మహానుభావుల త్యాగఫలం


"కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు"

Wednesday, March 21, 2018

నా తేట తెనుగు భాష...





అవధానమును జయించిన ఏకైక భాష

పద్యము తెలిసిన పదునైన భాష

అమ్మ నేర్పిన కమ్మని భాష

కనులకు ఇంపు అయిన భాష

వీనులకు విందైన భాష

కవి రాజులు మెచ్చిన భాష

కన్న తల్లి చనుబాల రుచి నా భాష

ఇంటి ముందు రంగవల్లి నా భాష

వేకువ ఝామున వెలుగు నా భాష

కటిక చీకటిలో కాంతి కిరణం నా భాష

స్వంత బిడ్డలే స్వార్ధంతో వదిలేస్తున్న భాష

అక్కరకు రాదని అనాధగా మారబోతున్న అమ్మ భాష

అదే అదే నా తేట తెనుగు భాష

తెలుగోడా...


తెలుగు భాషనీ చదవడము అటుఉంచి కనీసం మాట్లాడడము రాని , వచ్చిన మాట్లడితే నమోసి అనుకుంటున్నా మన తోటి తెలుగు వారి కోసం


మధురమైన మాతృభాషను మరచి

ఆంగ్లం వెంట అర్రులు చాచే అక్కుపక్షులు

కమ్మని గోమాత పాలు తాగి పెరిగి

కూల్ డ్రింక్స్ కి జేకొట్టు జేజెమ్మలు

చదవడం ఎప్పుడో మరచిపోయాం

మాట్లాడితే మలినమై పోతాయా మట్టి బుర్రలు

కీర్తి అంటే కాదు కేవలం పరభాషలను ప్రశంసించడం

మన మూలాలను మరచిపోకుండా ఉండడం

జాతి మూలాలను మరచిపోయి

జాత్యహంకారుల వద్ద ఒదిగిపోయి

నీ విద్వత్తును, విజ్ఞతను వారి అభివృద్దికి ధారపోసి

అవసరం తీరాక పొమ్మంటే, వెనుదిరిగి చూస్తే

ఎక్కడ ఉంది నీ అనే జాతి సాంప్రదాయం

ఇదేనా నీ తల్లి నీకు నేర్పిన సంస్కారం

అభివృద్ధి అంటే కాదురా అమ్మని మరచిపోవడం

అభివృద్ధి అంటే మరికొంత మందిని కలుపుకొని ముందుకు పోవడం

సాధించిన తరువాత నా అనే నలుగురు లేని ఆ గెలుపు ఎందుకు

కమ్మగా మన భాషలో గొంతెత్తి ప్రకటించలేని ప్రశంస మన కెందుకు

నిర్వీర్యము కాబోతున్న ఈనాటి మన నిమ్న జాతి ఖ్యాతి ఎలుగెత్తి చాటు

ఇది నిమ్న జాతి కాదు ఎందరికో కీర్తి తెచ్చిపెట్టిన బహు దొడ్డ జాతి అని నిరూపించు

ఓ తెలుగోడా ఇప్పటికైనా నా గోడు కొంచెం వినరా... లేకపోతే

ఒకనాడు మనకంటూ ఎవ్వరూ ఉండరు మన గొంతు వినిపించడానికి

Saturday, March 17, 2018

వచ్చింది అదిగో మళ్ళీ ఉగాది...

వచ్చింది అదిగో మళ్ళీ ఉగాది

స్వాగతించనా లేక మన స్వగతాన్ని తలచి శోకించనా

కొత్త బట్టల కొలతలకి దర్జీలు లేరు

చేనేత వస్త్రాల మగ్గాలు మచ్చుకైనా కానరావు

పచ్చడి మెతుకులకు దిక్కు లేని వాడికి షడ్రుచుల పచ్చడిలా

బరువెక్కేను అన్ని ధరలు బడ్జెట్ లో

సామాన్యుడి నడ్డి విరి చేను నడి రోడ్డులో

కొన్నా పన్నే , అమ్మినా పన్నే , సంపాదించినా పన్నే

పన్ను మీద పన్ను , ప్రభుత్వాలకు మనమే వెన్ను, దన్ను

పన్నయితే కట్టగలం పంటి కిందకి పట్టెడు అన్నం పంపలేము

ఇన్ని పన్నులు కట్టినా ఇంకా లోటు బడ్జెట్ లే

అభివృద్ధి అన్నమాట ఆశనిపాతాలే

కనీస నిలువలు లేవని కత్తిరిస్తారు మన సొమ్ముని

మన సొమ్ము దోచినవాడిని కనికరిస్తారు పొమ్ము పొమ్మని

మన స్వేద , రక్త మాంసాలు పెద్దవారికి విందులయ్యే

అలా అడిగిన వాళ్ళు అభివృద్దికి ఆటంకాలయ్యే

పంచాంగం వచ్చింది పరిహసించడానికి

వ్యయమే గాని ఆదాయం ఆనవాలికి కూడా కనిపించకుండా ఉండటానికి

మనుషులమని మరిచిపోయి, యంత్రాలతో పోటి పడి సంపాదించిందంతా

పన్నులు కట్టి , చివరాఖరికి చేతి చమురు చూసుకొని ,

సంవత్సరాంభంలో పంచాంగం నిజమని గడిపేస్తాము

ఇది ఎప్పుడూ సామాన్యుడి పంచాగమే

సమస్యలకు శంఖారావమే

దోపిడీ దొరలకు వర్తించదు ఇందులో ఏ అంకం

వారిదెప్పుడూ అంకెల గారడీలో అందేవేసిన తనం

గ్రహాల గతులను నమ్మే గానుగెద్దులం

మన చేతితో , మన నడ్డే విరిచే ప్రభుత్వాలను ఎంచుకున్న అమాయకపు గొర్రెలం

ఆవేశంలో అరిచాం, ఆకలేసింది తినేద్దాం, నిద్ర వస్తుంది పడుకుందాం

మళ్ళీ తెల్లారి లెగాలి ఉషోదయాన ఉగాదికి స్వాగతం పలకాలి కదా మరి...