Saturday, March 3, 2018

సిరియా...





ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం
అధికార దాహమో లేక  అహమో


 ప్రజా సంక్షేమ పరిపాలన చేస్తే సరిపోయే దానికి
విపక్షాల మీద విరుచుకుపడి ప్రజల ప్రాణాలు హరించాలా


 ఆదుకుంటారు అనుకున్న పెద్దన్నలు , చెరొక వైపు చేరి
రావణ కాష్టానికి మరింత ఆజ్యం పోస్తుంటే


వికసించని పసిమొగ్గలు , నేలకి ఒరిగిపోతుంటే
శరీర భాగాలు కళ్ళ ముందే విడివడి పోతుంటే


 అన్ని తెలిసీ మౌనం వహిస్తున్న ఐక్యరాజ్యసమితి
 శరణార్థులకు సాయం చేయలేక చేతులేత్తేస్తున్న పొరుగు దేశాల దుస్థితి


రక్కసి మూకల స్వైర విహారం ఆపి
అమాయకులను  ఆదుకోనక పోగా
ఆదను చూసి అంతర కార్యాలను నిస్సిగ్గు గా
నేరిపేస్తున్న అంతర్జాతీయ అధికారపు దొంగలు
మన పెద్దన్నలు


పాపం ఏవరిదో తెలియక , సాయం కోసం ప్రపంచ దేశాలను
ప్రాధేయపడుతున్న పసి కూనలు...
ఆదుకోలేక కన్నీరు పెడుతున్న వర్ధమాన దేశాలు..


లక్షల సంఖ్యలో ప్రాణాలు ఫణంగా పెట్టి
సాధించేదేముంది మరుభూమి మీద ఆధిపత్యం
చచ్చే ముందు మరణాలకు కారణమన్న పశ్చాత్తాపం


భీకర , భయానక , భీభత్స దృశ్యాలకయినా
చలించలేదా ఈ పాలకుల మనసులు
ఇకనైనా సంధించ లేరా తమ అధికారాలు సంధి కొరకు


కనిపించలేదా మీ కళ్ళకు
నెత్తురోడుతున్న మానవత్వం
శవాలుగా మారిన శాంతి సందేశాలు
అనాధలుగా మారిపోయిన ఐరాస ఆశయాలు
                                                      కుత్తుకతెగి విలవిల లాడుతున్న శ్వేత కపోతాలు

Thursday, March 1, 2018

గిరి పుత్రుడు


ఆకలేసి కేకలేసి

అడవిలో బ్రతకలేక

దానిక్కారణం అయిన జన అరణ్యంలో

కడుపు నింపుకుందామని ఆశ తో వచ్చి

వచ్చినా పని లేక

ఉన్నా ఇచ్చే నాధుడు లేక

ఆకలేస్తే, అడుక్కున్నా మెతుకు దొరక్క

నలిగిపోతున్న పేగుల కోసం

నాలుగు బియ్యపు గింజలు దొంగలిస్తే

దొరల వాళ్లే దొంగ లంజా కొడుకులు

కాళ్ళు ,చేతులు  కలియ గట్టి

ఒంటి మీద దెబ్బ మీద దెబ్బ కొట్టి

చేసిన చిన్న నేరానికి నీకు చితి కట్టి

పైగా ఆ హింసని పైశాచికంగా చిత్రించి

మానవత్వాన్ని మంట గలిపిన

ఈ నీతి చంద్రులు

కోట్లు కొల్లగొట్టిన బడా బాబుల జోలుకెళ్లరు

బడుగు జీవుడని నిన్ను

బంధించి

బాధించి

వధించారు


అయినా నువ్వు ఎప్పుడో చచ్చి పోయావు

వీళ్ళ ఇళ్ల కోసం మీ కొండ రాళ్లు తరలించినప్పుడు

వీళ్ళ విలాసాల కోసం ఫార్మ్ హౌస్ లు సృష్టించినప్పుడు

కలప ,ఔషధాలు ఒక్కటేమిటి అన్నింటిని వారి అవసరాల కోసం తరలించినప్పుడు

ఎప్పుడో చచ్చిపోయిన

నిన్ను ఇలా చిత్రవధ చేసి

వీళ్ళే సమాజం ముందు చచ్చిన శవాన్ని పీక్కు తినే

రాబందులుగా మిగిలిపోయారు