
“మమ్మల్ని నిలబెట్టటానికి నడికట్టు కట్టుకున్న అమ్మ ఇవాళ తానే వంగిపోయింది” అని
దాసోజు జ్ఞానేశ్వర్ గారి కవిత చదివినప్పుడు కలిగిన అనుభూతితో నాకు తోచిన మాటలు అమ్మకోసం...
అమ్మ
అనంత విశ్వంలో ఉన్న నన్ను ఆత్మీయంగా నీ గర్భాన చేర్చుకున్నావా...
అవస్థలెన్నో పడ్డావు ఆనందంగా, అండనై నీకు అండగా ఉన్నాననా ...
వికారంగా ఉన్నా, వాంతులు వస్తున్నా బహుప్రీతితో భరించావు, బాహ్యప్రపంచంలో నా రాకకై ఎదురుచూస్తూ...
శరీరం సహకరించాకున్నా, ఆకృతి మారిపోతున్నా, నా చిన్నిరూపం కోసం ఆలోచిస్తూ ఆనందంగా గడిపేసావా...
ఈ జన్మను నాకు ఇచ్చి, మరుజన్మ నువ్వు ఎత్తి, నన్ను చూసి మురిపంగా మురిసిపోయావా...
పత్యలు అంటూ పట్టిడన్నం పెడుతున్నా, పక్కను నేను పదే పదే తడిపేస్తున్నా పక్కనే ఉన్న నన్ను చూసి పరవశించి పోయావా...
రేయి, పగలు తేడా లేకుండా నేను ఏడుస్తూ, నిన్నుఏడిపిస్తుంటే, తండ్రి ఏ కష్టం వచ్చిందని చనుపాలను నా అధరాలకు అందించి ఆనందపడిపోయావా ...
మేము అమ్మనాన్నలం అయితే అప్పుడు తెలిసింది నిజమైన అమ్మతనం
స్కానింగ్ లో ఆ చిన్ని కణాన్ని చూసి పొంగిపోయిన క్షణాన గుర్తొచింది నువ్వే...
ఆ నవమాసాలు నా భార్యను చూస్తున్న ప్రతి క్షణం మదిలో మెదిలింది నువ్వే...
మమ్మల్ని కన్న తరువాత నువ్వు నువ్వుగా నిలబడటానికి నడికట్టు కట్టుకున్న...
నేడు మమ్మల్ని మా కాళ్ళ మీద నిలబెట్టి నువ్వు నిలబడ లేక వంగిపోతున్నావా ...
నీ గుండె లయ వింటూ పోసుకున్న ఈ ప్రాణం, నా ఆఖరి గుండె చప్పుడు వరకు నిను పూజిస్తూనే ఉంటుంది...
గుడి నీకు కడతానని చెప్పను గాని , ఈ నా గుండె కొట్టుకున్నంత వరకు గుండెల్లో పెట్టుకుంటాను ...