Thursday, May 11, 2017

నీవే ...నీవే ...





మౌనం నీవే మాటవు నీవే నా మదిలో మెదిలే భావం నీవే

ఉహవు నీవే ఊసులు నీవే నా కన్నుల్లో కదిలే కలవు నీవే

నీ కోసము నేనున్నాను అని నన్ను నడిపించే స్నేహం నీవే

నా కోసం అనుక్షణం ఆలోచించే   నా ఆత్మబంధం నీవే


ఏ దూరాన ఉన్న నా గుండె చప్పుడు జాడీలో ఒదిగివుంది నీవే

నిరంతరం నన్ను నన్నుగా  మేల్కొల్పే వేకువ నీవే

అనుక్షణం నన్ను ఆహ్లాదంగా తాకుతు నన్ను నేను మరిచేటట్లు చేసింది నీవే

ప్రతిక్షణం ప్రేరణ ఇస్తూ నన్ను నడిపించేది నీవే
 
 
నీ కోసం ఆలోచించే ప్రతిక్షణం నన్ను నేను మరిచిపోతాను

నా కోసం  ఆలోచించే ప్రతి క్షణం నీతో నిండి పోతాను

 నే ఒంటరిగా ఉన్న, నలుగురితో ఉన్న ని ఆలోచనలే 

జంటగా మనం గడిపిన  జ్ఞాపకాల చిరుజల్లుల పులకింతలే

మేము ఉద్యోగస్తులము




ఆశ తప్పితే ఆవేశపడలేని, అభాగ్యులం.

తెలిసినా గొంతెత్తి పలకలేని మౌన మునులం.

కాలం తో పాటుగా సాగిపోవడం తప్ప సాహసించి ఎదురు తిరగలేని సామాన్యులం.

సగటున అందరం జీతం కోసం ఎదురు చూసే జీవచ్చవాలం.

భద్రత పేరుతో భవిష్యత్తుని ఫణంగా పెట్టేస్తాం.

పదేళ్లకొకసారి వచ్చే వేతన సవరణ కోసం పడిగాపులు కాస్తాం.

బదిలీ అంటే బాధ్యతయుతంగా బయలుదేరుతాం, మా బాధ్యతలకు భగవంతుడి మీద భారం పెడతాం.

మమ్మల్ని కన్న వాళ్ళని మేము మరచిపోయాం, మేము కన్నా వాళ్ళు మమ్మల్ని మరిచిపోయారు,

ఎందుకంటే మేము ఉద్యోగులం మాకు బంధాల కన్నా, బాధ్యతలు ముఖ్యం.

ఐదేళ్లకు వచ్చేవాడు ప్రతి వాడు అధికారం చూపిస్తాడు,అవహేళన చేస్తాడు.

పన్నులు తప్పనిసరిగా చెల్లిస్తాం, మా బాధ్యత నిర్వర్తిస్తాం, హక్కులు అడిగితే అణగారి పోతాం.

వేతన సవరణ కోసం ఆలోచిస్తు త్రిశంకు స్వర్గంలో బ్రతికేస్తాం, ఆశించినది రాక పోయిన అమలులోకి వచ్చిన దానితో యధావిధిగా సర్దుకుపోతాం.

ఎందుకంటే మేము ఉద్యోగస్తులం

ఓ మనిషి




నా జననం జనం కోసం, నా మరణం మార్పు కోసం
నా జనన మరణాలు జనంలో మార్పు కోసం...
 

నా మార్గం విప్లవం, నా గమ్యం సమనత్వం
నా ధ్యేయం విప్లవంతో సమనత్వం సాధించడం...

విప్లవం అంటే కాదు విద్వంసం , విప్లవం అంటే కాదు విచక్షణా కొల్పోవడం
విప్లవం అంటే జనులందరిలో విజ్ఞతతో, వివేకాన్ని మేల్కొలపడం...

ఆకలి, దప్పికలు, అవకాశ ఆసమానతలు లేని
ఆర్హత బట్టే ఆధీకారం, శ్రమ బట్టే సౌకర్యం ఉన్న ప్రపంచం నా స్వప్నం...

ప్రకృతికి లేదు ఏ భేషాజం , వికృతుముగా ప్రవర్తిస్తుంది మనమే
చూసి నేర్చుకుందాం, ఈర్ష్య,ద్వేషాలను వదిలేద్దాం మనస్వప్నం సాధించుకుందాం...

ఈ దేహం మూడుణాల ముచ్చట , ఆదర్శంగా జీవిద్దాం
భావితరాలకు బంగారు బాట వేసి , చరిత్రలో చిరస్మరణీయులవుదాం...

ఆదర్శం అంటే కాదు మన జీవితాలను త్యాగం చెసేయ్యడం , కనిపించిన వారిని ఆప్యాయంగా
పకలరించడం , నహజ వనరాలను ఆవసరం మేరకు ఉపయోగించడం, ప్రకృతి సహజత్వం కాపాడడము,

వీలైనంత వరకు ఎదుట వారికీ సాయపడడం... 

తోటివాడు మనవాడే అనుకో, ఆర్తనాదం ఆలపించే అవకాశం ఇవ్వకు ఎవ్వరికి

కష్టం అన్నది కనిపించ నివ్వకు ని కనుచూపు మేరలో, విశ్వశాంతికి బీజం నువ్వు, వాసుదేక కుటుంబానికీ వారాసుడునువ్వు...

Sunday, May 7, 2017

మన వరాల తెలుగు


తెలుగు జాతి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిచెపుతానని ఆవిర్భవించిన ప్రాంతీయ రాజకీయ పార్టీ ,అదే నినాదంతో ప్రస్తుతం అధికారంలో ఉన్నపార్టీ , మీపార్టీ పేరును ఉచ్చరిస్తున్నప్పుడు కూడా మీకు గుర్తురాలేదా తెలుగు జాతి ఆవశ్యకత,తెలుగు బాషాప్రాముఖ్యత...

ఎందుకయ్యా తెలుగు వారంటే ఇంత చులకన ,అభివృద్ధి చేస్తున్నపుడు మేము కావాలి, అభివృద్ధిఅయిన తరువాత మేమువద్దా...

తమిళనాడు నుండి వెళ్లి పొమ్మన్నారు, మౌనంగావచ్చేసాము, హైదరాబాద్ నుండి వెళ్లి పొమ్మన్నారు,మౌనంగా వచ్చేసాము , ప్రత్యేకహోదా అన్నారు.. మీరే,మళ్లి మాట మార్చారు, అయిన సహించాం, కానీ మాతృబాషను మానుంచి దూరంచేస్తే భరించలేక పోతున్నాం,మా తల్లిని మాకు దూరం చేయకండి.

అభివృద్ధి ఈరోజు కాకపోతే రేపు చేసుకుంటాం,ఎందుకంటే ఇంత మందికి బంగారు బాటలువేసినవాళ్ళం, మాకు మేము చేసుకోలేమా ఒకనాటికి...

కానీ అమ్మనే దూరం చేస్తే అనాధలం అయిపోతాం, అన్యబాషాలో ఇమడలేక, మన బాషలో మనసు విప్పిమాట్లాడలేక, మాట్లాడేవాళ్ళు లేక పిచ్చివాళ్ళు అయిపోతాము.

అభివృద్ధి కోసం ఆంగ్లాన్ని నేర్చుకుందాం, అది అవసరంకూడా... ప్రపంచదేశాలతో మనవిద్య,వైజ్ఞానిక,వైద్య,వ్యాపార రంగాలలో పరస్పరసహాయసహకారాల కోసం...అంత మాత్రాన మనమాతృ బాషని భావితరాలకు దూరంచేసే హక్కు,అర్హతలు మీకెవరు ఇచ్చారు.

అభివృద్ధి చెందిన తరువాత అభినందించటానికి మనఅన్నవాళ్ళులేని ఆ అభివృద్ధి మనకెందుకు.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లిభూమిభారతిని నిలుపరా నీ జాతి నిండుగౌరవాన్నీ అన్ననానుడి మరిచి,మీ కభంద హస్తాలతో మన జాతి గొంతును మీరే నొక్కేస్తారా.

మన పక్కరాష్ట్రాన్ని చూడండి వాళ్ళ ఒక సాంప్రదాయక్రీడను కేంద్రప్రభుత్వం నిషేదిచిందని, పార్టీలకుఅతీతంగా, రాష్ట్రప్రభుత్వం, నాయకులు, ప్రజలు ఏకమైతమ సంప్రదాయాన్ని కాపాడుకున్నారు, మరి మన వాళ్ళ ఏమో,మన మాతృభాషను సమాధి చేయటానికియుద్దప్రతిపదికిన సన్నధ్ధులవుతున్నారు.

నారా,నారాయణ లారా ఒక్కసారి పునరాలోచనచెయ్యండి,ఏ జాతి కీర్తి,ఖ్యాతి అయినా ఆ జాతి బాషామీదే ఆధారపడి ఉంటుంది, మన జాతి ఖ్యాతినిదశదిశలు ప్రసరింపజేసిన మహానుభావులు అందరూమరొక్కసారి శాశ్వతంగా మరణిస్తారు, తెలుగుచచ్చిపోయే దుస్టితే వస్తే దాని కంటే ఒక్కరోజు ముందునేను చచ్చిపోతాను అనుకున్నవారు మీసాక్షిగా మరణిస్తారు.

మీ అమ్మ,నాన్నలకి మీరు గుడి కట్టించవద్దు కానీ ఎవరోకట్టిన గుడి ముందు మాత్రం అడుకునేట్టులు చేయవద్దు అలాగే మన తేటతెలుగును కీర్తించకపోయినా పరవాలేదు కానీ, కిరాతకంగా హత్య మాత్రంచెయ్యొద్దు.

ఉగ్గుపాలతో కమ్మగా నేర్చిన కమనీయ అమ్మ బాష నాతెలుగు, నా అన్న వాళ్ళను నా నోటితో మొదటిసారిగాపిలిచిన తొట్టతొలి భాష నా తెలుగు, నేటికీ నా ఊహలకిఆశాజనకం, ఉత్ప్రేరకం నా తెలుగుబాష.

మన తెలుగు జాతి, సంస్కృతికి,సంప్రదాయాలకు,చరిత్రకు చిహ్నంగా ఆంధ్రుల రాజధాని అమరావతిని నిర్మిస్తానని, వాటికి మూలం అయిన తెలుగు భాషనే సమ్ములనంగా సర్వనాశనం చేసేద్దాము అనుకుంటున్నారా

విద్య లేని వాడు వింత పశువు అని నాడు నానుడి , తెలుగు చదివిన వాడు చేవాలేని వాడు అని మన అమాత్యులు నేడు సృష్టిస్తున్నారు కొత్త నానుడి

చివరిగా ఒక మాట ఇంత మంది భాష కోసం భావోద్వేగాలతో చెప్తున్నా వదిలేయండి, ఒక్కసారి మీ కళ్లు మూసుకుని , గుండెమీద చేయిపెట్టి మీ ఆత్మ సాక్షిని అడగండి ,అప్పటికి చేయాలనుకుంటే మీకన్నా జాతి ద్రోహులు , చరిత్రహీనులు మరొక్కరుండరు...ఇది తథ్యం, ఇది తథ్యం.

ఇప్పటికి మించిపోయింది ఏమీలేదు...

అమాత్యులారా,మరొక్కసారి ఆలోచించండి, మన అమ్మ భాష ను ఆదరించండి.

ఒక తెలుగు భాషాభిమాని...

Friday, May 5, 2017

బాహుబలి


కీర్తి , ప్రతిష్టలకు పరాకాష్ట...

విమర్శకుల అంచనాలకే అందనంత దూరం...

ఆభరణాలకు, అహ్హర్యానికి, అభినయాలకు ఖచ్చిత నిర్వచనం

భారతీయ సినీ జగత్తులో మరో మకుటం లేని మహారాజు...

ఎన్నో అభినందనలు, ఎన్నోపొగడ్తలు,వాటితో పాటు కిట్టని వారు చేసే కొన్ని విమర్శలు...

అభినందనలు, పొగడ్తలు కోసం చెప్పవలసిన అవసరం లేదు.

ఒక కథానాయకుడి అకుంటిత దీక్షకు, ఒక అలుపెరుగని దర్శకుడి సృజనాత్మకతకు, పాత్రల ఎన్నికకు , కథ,కథనాలు నడిపిన తీరుకి , సందర్భోచిత సంభాషణలకు, దృశ్య కావ్యంగా మలిచిన వైనానికి,   

ఒక సాధారణ కథను , అసాదారణ చిత్రంగా రూపుదిద్దిన శ్రమ, పట్టుదలలకి దక్కిన గౌరవం ఈ చిత్ర అఖండవిజయం...

నాయకి నాయకులు,ప్రతినాయకుడు ఒక్కటేమిటి ప్రతి పాత్ర శరీర దారుడ్యం ,హావభావాలు, సంభాషణలు, నటన మీద పెట్టిన శ్రద్ధ అన్నిఅద్భుతం... వాటికి ఈవిజయమే నిదర్శనం.

ఇక పోతే విమర్శలు చూద్దాం...

ఇది మామూలు కథే:- అవును ఇది మామూలు కథె అని రాజమౌళి గారు ఎప్పుడో చెప్పారు,

మనం ఏ కధ చెప్పినా మహాభారతం,రామాయణం,భాగవతం ఈ మూడింటిలో లేని కధ ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు అని.

అలా అనుకున్నపుడు మీరే తిసేయవలసింది కదా సినిమా.



అనుకరణ (కాపీ) చేసారు:- అవును అనుకరించి దానిని ఇంకాస్త మెరుగుపరిచి చూపించడం తప్పులేదుకదా , IIT Chennai లో ఇదే విషయం పై రాజమౌళిగారు బాహుబలి 1 విజయం తరువాత విద్యార్దులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పారు.


దక్షిణ భారతదేశం సినిమా:- ఎందుకయ్యా సినిమాలు సినిమాలుగా కాకుండా ప్రాంతాల వారిగా, భాషా ప్రతిపాదికిన చూస్తారు, మీరు చేసిన మంచి సినిమాలు మేము ఎంతగానో ఆదరించాం, ఎంతో మంది నటీనటులు ఉత్తర భారతదేశం వచ్చి ఇక్కడ నటించలేదా, మీరు ఆదరించలేదా , ఇప్పుడు ఎందుకు ఈ భేషజాలు.

ఎవరో ఒక ఉత్తర భారతదేశ ప్రముఖ వ్యక్తి  బాహుబలి ఈఈ కోసం ఏవో విమర్శలు చేశారు అని ప్రచార మాధ్యమాల్లో వస్తే చూసి , ఎవరా అతను అని గూగుల్లో శోధిస్తే తెలిసింది... అతని కోసం ప్రస్తావించక పోతేనే మంచిదని.

చివరిగా ఇది తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిన ఒక అద్భుతమైన చిత్రరాజం , ఇలాంటివి మరెన్నోచిత్రాలు రావటానికి దిక్సూచి.

ఈ చిత్రం కోసం అహర్నిశలూ శ్రమించి, నిర్మించి మన కళ్లకు ఒక మహా అద్భుతానన్ని ఆవిష్కరించిన 24 విభాగాల్లో పనిచేసిన అందరికీ  అభినందనాలు తెలుపుతూ

ఒక సగటు ప్రేక్షకుడిని... 

Thursday, May 4, 2017

కళాతపస్వి మన విశ్వనాధుడు


కళాతపస్వి మన విశ్వనాధుడు


తెలుగు సిని జగత్తులో పరిచయం అక్కరలేని అతి కొద్దిమందిలో ఒక్కరు
తన కథ, కథనాలు తో ఎంతో మందిని గొప్ప కదానాయకులు గా మార్చిన

ఎంతో మందికి కొత్త ఇంటి పేరును తన సినిమాలతో చేర్చిన 
(శుభలేఖ సుధాకర్, శంకర భరణం శంకరశాస్త్రి, సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదలగు...)

కదానాయకుడు ఎవ్వరూ అని కాదు, కథ, కథనం తో చిత్రాన్ని విజయపథంలో నడిపించవచ్చు అని రుజువు చేసిన

తెలుగు సినీ జగత్తుకు తరగని సాహిత్య ఘనిని, మన సిరివెన్నెలను మనకు పరిచయం చేసిన

ఒక కళాకారుడి జీవితంలో అలాంటి ఒక చిత్రంలో నటించాలన్న, తీయలన్న కోరిక నెరవేరని రోజుల్లో, ఆలాంటి అద్భుత చిత్రాలను పదుల సంఖ్యలో ఆవలీలగా తీసి మెప్పించిన

తనకు పోటీ మరియు సమకాలికులు అయిన వారి దగ్గర సాయకుడిగా పనిచేయాలనే కోరికను వ్యాక్తపరిచి , తనకు ఇంకా నేర్చుకోవాలనే జిజ్ఞాసకు , పని మీద ఉన్న ప్రేమకు , ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలనే నిదర్శనం అయి నిలిచినా

అవార్డులు,రివార్డులు వల్ల వక్తి ఉన్నతిని బేరీజువేస్తున్నా ఈరోజుల్లో, వాటికే విలువ పెంచిన విశేష వక్తిత్వము చూపించినా

కన్నా తల్లికి , మాతృ భూమికి దూరంగా ఉంటూ వారు గుర్తొచ్చినప్పుడు ఏమి చెయ్యలా ఆని ఆలోచిస్తున్నా తరుణంలో , అతని చిత్రాలు చూసిన , పాటలు విన్నా , నాదేశం మట్టి మీద, నాతల్లీ ఓడిలో ఉన్న అనుభూతిని కల్గించగాల్గిన

కులం కన్నా వ్యక్తి, వ్యక్తిత్వం గొప్పదని “సప్తపది” లో చెప్పిన

ప్రేరణ ఉంటె ఏదైనా సాదించటానికి అవిటితనానికి కూడా హద్దులు ఉండవని “ సిరివెన్నల “ లో చెప్పిన

వ్యక్తిత్వం , విలువలు ఉంటే హోదాలతో పనిలేదని “ శుభలేఖ” లో చెప్పిన

ఉన్నత స్టానం పొందిన, ఈర్ష్య , ద్వేషాలు విడువక పొతే ఆంధ్పతలనికి వెళ్లిపోతారని “ స్వాతికిరణం” లో చెప్పిన

అన్నదమ్ముల బంధాన్ని,ఒకరికి ఒకరు ఆసరా,అవస్యకతలను “ స్వరాభిషేకం” లో చెప్పిన

తనను నమ్మే యజమాని కోసం , తనను ఇష్టపడే సేవకుడు ఎలా ఉండాలి అని “ శుభసంకల్పం” లో చెప్పిన

ఇలా ఎన్నోచెప్పాలి అనుకున్నావి నిస్కార్సగా , సున్నితంగా ,సాహిత్య,సంగీత సమ్మేళనంతో పండిత,పామర జనరంజకంగా చెప్పగలిగినా మన కళాతపస్వికి దాదా సాహెబ్ పాల్కే ఆవార్డ్ వచ్చిన సందర్బముగా  శిరస్సు వంచి , నమసుమజంలి గటిస్తూ , హృదయపూర్వక  అభినందనాలు తెలుపుతూ......

Sunday, April 30, 2017

శ్రీ శ్రీ

శ్రీ శ్రీ 107వ జయంతి శుభాకాంక్షలతో



చంద్రునికి ఒక నూలు పోగులా
మన శ్రీశ్రీ కోసం నామాటలలో....
మీ జనార్ధన్ శ్రీనివాస రెడ్డి


శ్రీ శ్రీ

ఈ మాటకు ముందు తెలుగు కవిత్వం ఒకటి ...ఈ మాట తర్వాత ఒకటి అనేంతగా
తెలుగు కవిత్వాన్ని సాహిత్యాన్ని ప్రభావితం చేసిన మనందరి మహాకవి శ్రీశ్రీ.

ఒకనాటి కవిత్వము అంటే సగటు మనిషికి అర్థం కాని ఛందస్సు వ్యాకరణాలను తన కవిత్వంతో మార్చిన మహర్షి మన శ్రీ శ్రీ.

కవిత్వం అంటే ప్రేయసి ని వర్ణించటం, చందమామ అందాలను చూపటం, సాగర తీరాల సోయగాలు, ప్రకృతి కి పరవశించి ప్రాసలో వచ్చే పదాలే కాదు, జాతిని జాగృతం చేయవచ్చు... ఒక స్నేహితుడి కి అశ్రు నివాళి అర్పించవచ్చు...కవిత్వానికి కాదేదీ అనర్హం. సబ్బుబిళ్ల, చెక్క బల్ల, అగ్గిపుల్ల అని తన చేతల వ్రాతలతో తెలుగుదనానికి ఆవేశాన్ని ఆవహింపచేసిన మహా మనిషి మన శ్రీ శ్రీ.

తెలుగు పలకడం రాని ఎంతో మంది చిన్నారులను, మధ్యవయస్కులను మేధావులను కలం పడితే న అంత కాకపోయినా ఎంతో కొంత వ్రాయగలరు అని ప్రోత్సహించిన సరళ కవిత్వానికి మహాగురువు మన శ్రీ శ్రీ.

శ్రీ అంటే అంకురార్పణ, శ్రీ అంటే సంపద. తెలుగు కవిత్వానికి నూతన ప్రస్థానాన్ని అంకురార్పణ చేసి, ఆ సంపదను తెలుగు వారికి సగర్వంగా సమర్పించిన సమకాలీన సాహిత్య సౌరభం మన శ్రీ శ్రీ.

ప్రపంచం ఒక పద్మవ్యూహం అన్నా, కవిత్వం ఒక తీరని దాహం అన్నా, పల్లెటూరులో కొడుకు కోసం తల్లి పడ్డ బాధ చెప్పిన , నచ్చిన పాశ్చాత్య సాహిత్యాన్ని తర్జుమా చేసినా, జగన్నాధ రథచక్రాల తో తన పదబంధాలను మనకి చూపినా ...చెప్పే మాటల్లో తీవ్రత...పలికే భావంలో తీక్షతకు కదలని హృదయం లేదు అన్నట్లు చేసిన ఓ కవి సామ్రాట్ మన శ్రీ శ్రీ.

Tuesday, January 24, 2017

ప్రత్యేక హోదా ప్రతి ఆంధ్రుడి హక్కు


కదలి రండి కదలి రండి అన్నలారా,తమ్ములారా,అమ్మలార, నాన్నలార,
కదలి రండి కదలి రండి చెల్లెల్లారా,అక్కలారా
ప్రత్యేక హోదా, కావాలనుకున్న ప్రతి పౌరులారా...

మన బలమేమిటో చూపిద్దాం, నిజ సంద్రాన్ని ముంచేద్దాం,మన జనసంద్రంతో....
సమైక్యతను సగం చేసి, మన భవితను అంధకారంలోనింపిన మన పాలకులకు , మన ఏలుకులకు ఎలుగెత్తిచాటుదాం ప్రత్యేక హోదా ప్రతి ఆంధ్రుడి హక్కు అని ...
నాడు మీరు చెప్పిందే నేడు మేము కావాలంటున్నాం..
మా సహనాన్ని పరీక్షించటానికి రెండేళ్ళు సరిపోలేదా...
అద్ధంతరంగా ఆంధ్రను రెండు చేసిన వాళ్ళకు
గణతంత్ర దినోత్సవం గణనీయంగా గుర్తుండిపోయేలా ,
ప్రత్యేక హోదాకి తొలి అడుగు పడేటట్లు , మన సత్తాచాటుదాం.

సహనం తో మరోసారి మీముందుకు వస్తున్నాం,సానుకూలంగా అలోచించి సామరస్యంతో సమస్యనిపరిష్కరిస్తారని సవినయం గా కోరుకుంటున్నాం,.,,

ఒక ప్రధాన మంత్రి ప్రత్యేక హోదా ఇస్తాను అని, మరొకప్రధాని పురిటి బిడ్డను ఆదుకుంటాను అని అన్నారు.
ఇదేనా ఇవ్వడం అంటే, ఇదేనా ఆదుకోవడం అంటే...
మీ మాటలకే విలువ లేకపోతే రాజ్యాంగం అవహేళనఅవుతుంది, ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుంది... 

కులమతాలకు దూరంగా, రాజకీయరంగస్థలానికిఅతీతంగా మా గుండెల్లో రగులుతున్న భావాలకుప్రతిరూపంగా,
సామరస్యంతో సామూహికంగా సంధిస్తున్న నినాదంఒక్కటే
"ప్రత్యేక హోదా ప్రతి ఆంధ్రుడి హక్కు" 

ఒక ఆంధ్రుడు
జనార్ధన్ శ్రీనివాస రెడ్డి

Saturday, August 29, 2015

తెలుగు భాషా దినోత్సవం

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు , అన్నది కూడా మన తెలుగు వాడు కాదు.

అంతటి ఔన్నత్యం ఉన్న తెలుగు నేడు ఎందుకు ఇంత హీన స్థితిలో ఉంది (క్షమించాలి, ఈ పదజాలం ఉపయోగించినందుకు, కానీ వాస్తవం ఇదే)

పక్క రాష్ట్రాలలో ఆయా భాషలలో మాట్లాడకపోతే విలువ ఉండదు. మన రాష్ట్రంలో మన భాషలో మాట్లాడితే విలువ ఉండదు..

దీనికి బాధ్యులు ఎవరు ??? మనం  కాదా…(తల్లిదండ్రులు, ప్రభుత్వము)

తల్లిదండ్రులు : మనం మన పిల్లలని తెలుగు మీడియం లో చదివించము… సరే ఒప్పుకుంటాను, ఆంగ్లం రాకపోతే, ఈ పోటీ ప్రపంచం లో నిలదొక్కుకోవటం కష్టం కాబట్టి….

కానీ వారిని ఇంట్లో కూడా తెలుగు లో మట్లాడనీయం… ఎందుకంటే వారికి ఆంగ్ల ఉచ్చారణ ఆలవాటు అవ్వదని… ఇదెంతవరకు సమంజసం.

ఎంతమంది తల్లిదంద్రులు రామాయణ, మహ భారతాలు,పంచతంత్రం వంటి కథలు తమ పిల్లలకు చెపుతున్నారు( ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు)…

రాముడు, కృష్ణుడు అంటే ఈనాటి పిల్లలకు ఫ్యాన్సీ డ్రస్ పోటీలో ఒక వేషం మాత్రమే.

వారి కథ వీళ్ళకి తెలియదు, వారి పాత్రల ఔన్నత్యం మనం మన పిల్లలకి చెప్పము.

మనవాడు Spell Bee లో ఎంపికయ్యాడని గర్వపడుతున్నాం కాదనను…కానీ మనలను అమ్మ నాన్న అని పిలవడం లేదని మరచిపోతున్నాం.

మన ప్రభుత్వం తెలుగు ప్రోత్సాహకాలు అని అంకెలగారడీ చూపించడమే గానీ చేసింది ఎమీ లేదు.. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మొక్కుబడిగా తెలుగు భాషా దినోత్సవం జరపడం తప్పితే పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన భాష కోసం చేసిందేమీ లేదనిపిస్తుంది.

మనం Shakespeare, Tolstoy వంటి వారికోసం తెలుసుకుందాం…కానీ నన్నయ,తిక్కన ఎర్రన , పోతన వంటి వారిని మరచిపోవద్దు.

వారే కాదు మన సాహిత్యం కోసం పాటు పడిన ఎందరో మహానుభావులందరి గురించి తెలుసుకుందాం, తెలుసుకుని మన పిల్లలకి చెబుదాం.



ఇకనైనా మన పిల్లలకి తెలుగు నేర్పిద్దాం, మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పదనం వారికి ఆలవాటు చేద్దాం.

కనీసం మన పిల్లలతో అమ్మ నాన్న అని అచ్చ తెలుగు లో పిలిపించుకుందాం.

ఈ మార్పుని మన ఇంటినుంచే మొదలు పెడదాం.

29 ఆగష్టు – తెలుగు భాషా దినోత్సవం

Sunday, August 2, 2015

స్నేహం...



ఇది అందరి జీవితం లో ఒక భాగం…

ఇది లేని జీవితం వ్యర్ధం…

దీనిని అనుభవించని జీవితం అసంపూర్ణం…

ఎన్నో పాఠాలను మరెన్నో గుణ పాఠాలను…

ఎన్నో అనుభూతులను మరెన్నో ఆనంద క్షణాలను…

అలవోకగా పంచే…ఆత్మీయ అనుబంధం ----స్నేహం

కష్టాలలో సుఖాలలో మన అన్న వారు కనపడనప్పుడు…
నేనున్నానంటూ అభయ హస్తం అందించేదే స్నేహం…

సంవత్సరానికి ఒక్కసారి కలిసినా…ఆరోజు కోసం క్షణం, ఆ జ్ఞాపకం
నేటికీ తలచుకుంటే అత్యద్భుతం రా శ్రీను…ఇదేరా స్నేహం

చిననాటి ఆ నలుగురు స్నేహితులు, వారితో కొట్లాటలు, సరదాలు,  జారుడు బల్లలు, కోతి కొమ్మచ్చులు,
బడి గంట కొట్టినప్పుడు., పరుగు పరుగున వెళ్తూ పడిపోయిన స్వామి గాడు…

ఈరోజు తల్చుకుంటే ఎంత హాయి…
ఇదేరా స్నేహం…
వీధి చివర్న, హై వే రోడ్డుపైన…గోలీలాటలు, కర్రాబిళ్ళలు, ఎదుటి గ్రూపుతో కొట్లాటలు…
క్రికెట్లూ, కబడ్డీలు, ఎన్నో ఎన్నెన్నో …తలచుకుంటే నాటి జ్ఞాపకాల దొంతరలో..ఎక్కడో మనల్నందరినీ ఒకటిగా కలిపి, ఇన్ని మధురానుభూతులనిచింది స్నేహమే కదా…

చదువుల సుడి గాలి లో కొట్టూకుపోతున్న…కాలేజిలో…ఆ ఏజిలో…  ర్యాగింగు చేసిన సీనియర్లు…మరలా సంవత్సరపు మన తోటి స్నేహితులు…క్యాంపస్సులో క్రికెట్టులూ…బీచ్ లో స్నానాలు..హాస్టలులో కంబైండు స్టడీస్...బీచ్ లో హాఫ్ డేస్…

తెలుగు తప్ప అన్య భాష రాని నాలాంటి వాళ్ళకు…బాధ్యతాయుతంగా ఇంగ్లీషు పాఠాలు నేర్పిస్తుంటే…మేమున్నామంటూ భరోసా ఇచ్చి… పరభష మీద…భయం పోయేట్లు చేసింది మీ స్నేహం కాదా…

ల్యాబ్ ల బయట…గ్రౌండ్ గట్టు మీద లైబ్రరీలో…మనతో పాటు కూర్చుని…వారికి వచ్చింది కొంత మందికి చెప్తూ…రానిది వేరే వాళ్ళనుంచి నేర్చుకుంటూ…ల్యాబ్ లు యూనిట్ లు కంప్లీట్ చేసింది, చేయించింది ఈ స్నేహమే కదా…

పది వసంతాలు దాటిపోయిన…పదిరోజుల క్రితమే విడిపోయామన్న మధురానుభూతిని ఇచ్చింది ఈ స్నేహమే కదా…

పని ఒత్తిడి లో మనుషులమన్న ధ్యాసను మరిచి…మరమనుషుల్లా పనిచేసుకు పోతున్నా, ఒక స్నేహితుడి పుట్టిన రోజని, మరొకడి పదోన్నతి అని మన వారాంతాలను అందరం ఆహ్లాదం గా దూరంగా, సాగర తీరంలో, నక్షత్రపు హోటళ్ళలో గడిపింది ఈ స్నేహం వల్లే కదా…

మీటింగుల మీద మమకారంతో…బాసంటే భయంతో టార్గెట్లను పూర్తిచేస్తూ ఉషోదయ వేళ…స్విమ్మింగులూ షటిళ్ళతో బాధ్యత బరువులను మరచిపోతూ ..సరదాగా గడిపింది ఈ స్నేహం వల్లే కదా…

నా జీవిత భాగస్వామిగా నా ప్రతి మజిలీలో సహ బాటసారిగా …ప్రతి కష్టం, సుఖంలో నాకు చెదోడు వాదోడుగా ఏ అరమరికలూలేని నా జీవితం ఇంత సంతోషం గా ఉండటానికి ఇంకేదో బంధం ఉంది అనుకుంటుంటే ఇప్పుదు తెలిసింది కారణం…అది స్నేహమే కదా…

నా చిన్ననాటి నుంచి నేటి వరకు, ఏదో విధంగా నా జీవితం మీద ప్రభావం చూపిన నా స్నేహితులందరికీ ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు….

శ్రీ
(BJS Reddy)

Tuesday, July 28, 2015

మన కలాం


కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు , మహాపుఋషులౌతారు అని మనమందరం చదువుకున్నాం...
కానీ అది నువ్వు మాత్రమే నిరూపించావు…

నక్షత్ర మండలానికి వెలుగు కావాలని…అర్ధాంతరంగా జాతి మొత్తాన్ని అంధకారంలో నింపి వెళ్ళిపోయావు.

ఆయువే కావాలంటే ఆ దేవుడికి, నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరు నీకోసం…
కానీ నువ్వే కావాలంటూ తీసుకెళ్ళిపోయాడు..

ఎక్కడున్నావయ్యా వివేకానందా అని ఎదురు చూస్తున్న తరుణంలో
నిదురిస్తున్న నా జాతి యువతకు నీ మాటల చేతల ప్రేరణ తో
జాగృతినిచ్చావు…

పసివాడిగా ఉన్నప్పుడు పేపర్లు పంచావు..
ఆ ప్రేరణ తో ప్రపంచాన్ని జయించావు…ఆ పేపర్లకే పతాక శీర్షిక వయ్యావు…

ఏ తల్లి కన్న బిడ్డవో భరత మాత కు ముద్దు బిడ్డవయ్యావు…
కొన్ని కోట్ల మంది బిడ్డలకు స్ఫూర్తివయ్యావు.

నువ్వు కన్న కలలు మేము నెరవేర్చలేకపొతున్నామని…
మరణించి…మరుజన్మ లో ఆ కలలని సాధించి చూపిద్దామని వెళ్ళిపోయావా..

ఒక వ్యక్తి జన్మకు సార్ధకత అంటే ఇలా ఉండాలని చూపిన నీకు జోహార్లు.

ఒక రంగంలో ప్రసిద్ధి చెందడమే గగనం అయిపోతున్న ఈరోజుల్లో…
ఒక వ్యక్తి గా, మిసైల్ శక్తి గా, అభిమాన నేతగా, బాలాల పాలిట ప్రేమను పంచే తాతగా,
యువతకు స్ఫూర్థి ప్రదాతగా, దేశ విదేశాలకు దిక్సూచి గా, నిలిచావు…

రామేశ్వరం నుంచి రాష్ట్రపతిగా నీ ప్రయాణం అనితర  సాధ్యం చేసి…ఆ దేవతలకు సైతం స్ఫూర్తి నిచ్చి ఉంటావు…
అందుకే స్వర్గంలో అత్యున్నత పదవినివ్వటం కోసం నిన్ను తీసుకెళ్ళిపోయారు…